సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav).. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌గా తన మార్క్ చూపిస్తున్న ప్లేయర్. టీమిండియాకు ఆసియా కప్‌ను అందించి తన సారథ్య సత్తాను చూపించుకున్నాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా టూర్‌కు రెడీ అవుతున్న జట్టుకు కూడా అతడే కెప్టెన్సీ నిర్వహిస్తున్నాడు. రోహిత్‌ను పక్కనబెట్టి మరీ టీమ్ పగ్గాలను సూర్యకుమార్‌కు అందించారు. అయితే తాజాగా తన కెరీర్ గురించి మాట్లాడుతూ సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు తన క్రికెట్ కెరీర్ విషయంలో ఏదైనా లోటు, బాధ ఉందంటే అది ఒకే ఒక్కటన్నారు. అదేంటంటే కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడమని చెప్పాడు.
టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన మాస్టర్ కెప్టెన్ సారథ్యంలో ఆడలేదన్న లోటు తనకెప్పుడూ ఉంటుందని చెప్పాడు. ఆఖరికి ఐపీఎల్‌లో కూడా తనకు ఆ అవకాశం దక్కలేదని, అందుకు తానెప్పుడూ చింతిస్తూ ఉంటానని అన్నాడు.
‘‘టీమిండియా కెప్టెన్‌గా ధోనీ(Dhoni) ఉన్నప్పుడు నేను ఒకటే కోరుకునేవాడిని. అతడి నాయకత్వంలో ఒక్క మ్యాచ్ అయినా ఆడాలని. కానీ అది జరగలేదు. ఆ అవకాశం నాకు రాలేదు. ఐపీఎల్‌లో కూడా మేము వేరువేరు జట్లకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రత్యర్థులుగా తలపడ్డాం. ఎలాంటి పరిస్థితిలో అయినా ధోనీ కూల్‌గా ఉండటం చూసి ఆశ్చర్యమేసేది. స్టంప్స్ వెనక అంత కూల్‌గా ఎలా ఉంటుంన్నాడో అర్థమయ్యేది కాదు. ధోనికి ప్రత్యర్థిగా ఉన్న సమయంలో ఎలాంటి ఒత్తిడి పరిస్థితిలో అయినా కూల్‌గా ఉండటాన్ని నేర్చుకున్నా. నా చుట్టూ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిర్ణయాలు తీసుకోవడం కూడా ధోనీ నుంచే నేర్చుకున్నా’’ అని సూర్యకుమార్(Suryakumar Yadav) వివరించాడు.

