epaper
Friday, January 16, 2026
spot_img
epaper

ప్రియాంకకు పగ్గాలు అప్పగించండి.. సోనియాకు పార్టీ మాజీ ఎమ్మెల్యే లేఖ

కలం వెబ్‌డెస్క్:  ’ప్రియాంకాగాంధీని (Priyanka Gandhi) ఏఐసీసీ అధ్యక్షురాలుగా చేయండి. అప్పుడే కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకొనే అవకాశం ఉంది.‘ అంటూ ఆ పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే నేరుగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి లేఖ రాశారు. గాంధీ కుటుంబసభ్యులను పార్టీ అధ్యక్షులుగా చేయాలన్న డిమాండ్ ఆ పార్టీలో మామూలే. చాలా మంది నేతలు బహిరంగంగా ఇటువంటి కామెంట్లు చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఓ ఎమ్మెల్యే నేరుగా సోనియా గాంధీకి లేఖ రాయడం గమనార్హం. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) 26 అక్టోబర్ 2022 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. అయితే ఆయనను తప్పించి గాంధీ కుటుంబసభ్యులకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని వాదన ముందుకొస్తున్నది. తాజాగా ఒడిశాకు చెందిన ఎమ్మెల్యే మొహమ్మద్ మోక్వీం(Mohammed Moquim) సోనియా గాంధీకి లేఖ రాశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అత్యంత బలహీన స్థితిలో ఉందని ప్రియాంకా గాంధీకి అధ్యక్ష పదవి అప్పగించాలని ఆయన ఆకాంక్షించారు.

లేఖలో ఏం ప్రస్తావించారు?

‘నాకు కాంగ్రెస్ పార్టీతో విడదీయరాని బంధం ఉంది. ప్రస్తుతం పార్టీ పరిస్థితి చూసి ఆవేదనతో ఈ లేఖ రాస్తున్నాను. తరతరాలుగా మాది కాంగ్రెస్ కుటుంబం. నాకు పార్టీతో విడదీయరాని బంధం ఉంది. ఒడిశాలోని కటక్–బరబటి మాజీ ఎమ్మెల్యేగా పనిచేశాను. మా కుటుంబం కాంగ్రెస్‌తో ప్రత్యేకమైన అనుబంధం కలిగి ఉంది. అది రాజకీయ బంధం మాత్రమే కాదు. ఓ వారసత్వ బంధం. తరతరాలుగా వస్తున్న బాధ్యత. స్వాతంత్ర్య సమరంలో మా ముత్తాత ప్రముఖ కాంగ్రెస్ నాయకులతో కలిసి పోరాడారు. మా అన్నగారు, 42 ఏళ్ల పిన్న వయస్సులోనే కన్నుమూసినా, తుది శ్వాస వరకు పార్టీ కోసం పనిచేశారు. వారి సేవలకు ప్రేరణగా నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాను. 35 ఏళ్ల తరువాత కటక్–బరబటి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను.’ అంటూ ఆయన చెప్పుకున్నారు. 2024లో తన కుమార్తె సోఫియా ఫిర్దౌస్ కూడా ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందిందని చెప్పారు. ప్రధాని, కేంద్ర హోం మంత్రి, అప్పటి ఒడిశా ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా ప్రచారం చేసినా ఆమె ఘన విజయం సాధించిందని చెప్పుకొచ్చారు. Priyanka Gandhi ని పార్టీ అధ్యక్షురాలిగా నియమించాలని కోరారు.

స్వీయ తప్పిదాల వల్లే..

కాంగ్రెస్ పార్టీ స్వీయ తప్పిదాల వల్లే దెబ్బతింటోందని ఆయన లేఖలో ప్రస్తావించారు. ఇప్పుడే మేలుకోకపోతే చాలా నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ఒడిశాలో వరుసగా 6 సార్లు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని.. జాతీయ స్థాయిలో వరసగా మూడు సార్లు పార్టీ దెబ్బతిన్నదని గుర్తు చేశారు. పార్టీ సంస్థాగతంగా బలహీనం అవుతోందని.. కార్యకర్తలు మానసికంగా కుంచించుకుపోతున్నారని ఆమె ప్రస్తావించారు. కార్యకర్తలు బూత్ నుంచి బ్లాక్, జిల్లా నుంచి రాష్ట్రస్థాయి వరకు పూర్తిగా నిరుత్సాహంతో ఉన్నారని పేర్కొన్నారు. ఇంతకాలం విశ్వాసంగా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు నైతికంగా బలహీనం అవుతున్నారు. బీహార్, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, కశ్మీర్ రాష్ట్రాల్లో ఘోరంగా దెబ్బతిన్నామన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వెంటనే అంతర్గత సమస్యలపై దృష్టి సారించాలని కోరారు.

ఒడిశాలో నాయకత్వ సంక్షోభం

‘2023లో 18 మంది సీనియర్ నాయకులను ఢిల్లీ పిలిపించిన తర్వాత, సరత్ పట్నాయక్‌ను ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించడం తీవ్ర ఆందోళనలకు కారణమైంది. ఆయన వరుసగా 6 సార్లు లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయారు. అందులో కొన్నిసార్లు డిపాజిట్ కూడా కోల్పోయారు. ఆయన నాయకత్వంలో 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ చరిత్రలోనే కనిష్టమైన 13% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆయన స్వయంగా పోటీ చేసిన స్థానంలో మరోసారి ఓటమి పాలై, మళ్లీ డిపాజిట్ కోల్పోయారు.’ అని ఎమ్మెల్యే మొహమ్మద్ మోక్వీం ప్రస్తావించారు. మరి ఈ ఎమ్మెల్యే సూచనలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకుంటుందా? అధ్యక్ష పదవి ప్రియాంకా గాంధీకి అప్పజెప్తుందా? అన్నది వేచి చూడాలి. గతంలో రాహుల్ గాంధీని ఏఐసీసీ అధ్యక్షుడిగా చేద్దామని డిమాండ్ వచ్చినప్పటికీ ఆయన తిరస్కరించారు.

ఇక బీజేపీ నిత్యం వారసత్వ రాజకీయాలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు గుప్పిస్తూ ఉంటుంది. ప్రియాంకకు (Priyanka Gandhi) అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే ఆ పార్టీ నుంచి విమర్శలు మరింత పెరిగే చాన్స్ ఉంది. మరి ప్రియాంకా గాంధీ ఆ పదవిని తీసుకోవడానికి ఇష్టపడుతుందా? లేదా? అన్నది కూడా వేచి చూడాలి.

Read Also: ఏడాది పొడవునా విమాన టికెట్​ రేట్లు నియంత్రించలేం: రామ్మోహన్​ నాయుడు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>