కలం డెస్క్ : ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విచారణకు గైర్హాజరు అయిన మంత్రి కొండా సురేఖ(Konda Surekha)పై స్పెషల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు (Spl JFCM) ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణ తేదీలు స్పష్టంగా తెలిసినా హాజరు కాకపోవడాన్ని తప్పుపట్టింది. ఈసారి హాజరు కాకపోతే నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. సినీ నటి సమంత, మాజీ మంత్రి కేటీఆర్‌లను ఉద్దేశిస్తూ మంత్రి కొండా సురేఖ గతంలో చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న కేటీఆర్.. క్రిమినల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆధారరహితంగా వ్యాఖ్యలు చేసినందుకు మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్‌లో కోరారు.
ఏడుసార్లు విచారణకు మంత్రి డుమ్మా :
గతేడాది ఆగస్టులో దాఖలైన ఈ పిటిషన్‌పై ఇప్పటివరకు ఆరుసార్లు విచారణ జరిగింది. తాజాగా డిసెంబరు 11న ఏడవసారి విచారణ జరిగింది. ట్రయల్‌లో భాగంగా అక్టోబరు 9న మంత్రి హాజరైన పిటిషన్‌లో పేర్కొన్న విషయాలపై వివరణ ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన విచారణలకు మంత్రి కొండా(Konda Surekha) హాజరుకాలేదు. తాజాగా జరిగిన విచారణకు సైతం ఆమె గైర్హాజరు కావడంతో కోర్టు సీరియస్‌గా పరిగణించింది. తదుపరి విచారణ వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న జరగనున్నందున ఆ రోజు హాజరు కాకపోతే బెయిలబుల్ లేదా నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సి వస్తుందని ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ హెచ్చరించారు. ఇప్పటికే వారెంట్ జారీ అయినట్లు వచ్చిన వార్తలను మంత్రి తరఫు ప్రతినిధులు ఖండించారు.
Read Also: హ్యామ్ రోడ్స్.. స్లో ప్రోగ్రెస్
Follow Us On: Youtube


