కలం, వెబ్ డెస్క్: శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 17 నుంచి 21 వరకు హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తెలిపారు. ఐదు రోజుల పర్యటనను దృష్టిలో పెట్టుకుని చేపట్టాల్సిన ఏర్పాట్లపై గురువారం రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటన సమయంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, రాష్ట్రపతి నిలయం అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు.
పోలీసు శాఖ భద్రతా, ట్రాఫిక్, బందోబస్త్ ప్రణాళికను సిద్ధం చేయాలని, అగ్నిమాపక శాఖ అవసరమైన సిబ్బందితోపాటు ఫైర్ టెండర్లు, అన్ని రకాల అగ్నిమాపక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ వైద్య బృందం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్లు భవనాల శాఖ అవసరమైన బారికేడ్లు, ఇతర ఏర్పాట్లు చేయాలని, జీహెచ్‌ఎంసీ (GHMC)–పోలీసు శాఖల సమన్వయంతో రోడ్ల మరమ్మతులు చేపట్టాలని సూచించారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం తగు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి నిలయంలో (Rashtrapati Nilayam) 24 గంటలు స్నేక్ క్యాచర్ బృందం అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
జీహెచ్‌ఎంసీ సమన్వయంతో రాష్ట్రపతి నిలయం పరిసరాల్లో కోతుల బెడదను తగ్గించేందుకు ప్రత్యేక బృందాలను నియమించాలని, అలాగే తేనెటీగలను నియంత్రించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Also: బిహార్లోని సీతామర్హిలో ఎయిడ్స్ కలకలం
Follow Us On: Instagram


