కలం డెస్క్ : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును (Prabhakar Rao) విచారణ నిమిత్తం పోలీసు కస్టడీకి అప్పగించేందుకు సుప్రీంకోర్టు అనుమతి మంజూరు చేసింది. ఆయన వయసును దృష్టిలో పెట్టుకుని, సీనియర్ సిటిజెన్‌గా ఉన్నందున ఎలాంటి శారీరకంగా ఎలాంటి ఇబ్బందులకు గురిచేయవద్దని జస్టిస్ నాగరత్న స్పష్టం చేశారు. ఎప్పటి నుంచి ఎప్పటివరకు పోలీసు కస్టడీ అవసరమో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదికి సూచించారు. గతంలో ప్రభాకర్ రావు వాడిన ఐ-క్లౌడ్ అకౌంట్ల నుంచి ఏం సమాచారం కోరుకుంటున్నారంటూ ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. అకౌంట్ల పాస్‌వర్డ్స్ తెలియని కారణంగా చాలా వివరాలు గోప్యంగానే ఉండిపోయాయని, సుప్రీంకోర్టు గతంలోనే రీసెట్ చేయాలని చెప్పినా ఆయన నుంచి తగిన సహకారం లేదని సుప్రీంకోర్టు బెంచ్‌కు తెలియజేశారు.
ఐ-క్లౌడ్ అకౌంట్లలోనే అసలు సంగతి :
ఆయన వాడుకున్న ఐ-ఫోన్‌లో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌తో వినియోగించిన ఐ-క్లౌడ్ అకౌంట్లను ఓపెన్ చేసేందుకు, అందులోని మేటర్‌ను పరిశీలించేందుకు రాష్ట్ర పోలీసులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా రీసెట్ చేయాలని గతంలోనే ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టు సూచించింది. అయినా టెక్నికల్ ఇబ్బందులు వస్తున్నాయని ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూధ్రా గురువారం విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న, జస్టిస్ మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనానికి వివరించారు. ప్రభాకర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ నుంచి జస్టిస్ నాగరత్న కొన్ని వివరాలను తీసుకున్నారు. ప్రభాకర్ రావు వాడిన నాలుగు ఐ-క్లౌడ్ అకౌంట్లలో మూడింటిని రీసెట్ చేయగలిగామని, ఒకటి మాత్రం అమెరికాలో ఉన్నప్పుడు వాడిన ఫోన్ నెంబర్‌తో రిజస్టర్ చేసుకున్నందున అది ఓపెన్ కావడంలేదని, ప్రస్తుతం ఆ నెంబర్‌ను వాడనందువల్లనే ఈ ఇబ్బందులని బెంచ్‌కు వివరించారు.
డాటాను డిలీట్ చేయడం క్రైమ్ కాదా? :
రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగం పదేండ్ల పాటు దాచిన డాటా మొత్తం మాయమైందని, మొత్తం 26 హార్డ్ డిస్కుల్లో నిక్షిప్తమైన సమాచారాన్ని తొలగించడం నేరం కాదా అని ప్రభాకర్ రావు తరఫు న్యాయవాదిని జస్టిస్ మహదేవన్ ప్రశ్నించారు. ఐ-క్లౌడ్ పాస్‌వర్డ్ ఇవ్వాలని అడిగితే మర్చిపోయా.. అంటూ బదులిస్తున్న ప్రభాకర్ రావు.. ఆ తర్వాత మాత్రం కొన్ని ఘటనలను నిలదీస్తే ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయని జడ్జి ఉదహరించారు. చివరకు ఆ హార్డ్ డిస్కులను పరిశీలిస్తే అందులో ఏమీ లేవని, ఇలా ధ్వంసం చేయడం నేరం కాదా అని ఆయన తీరును జడ్జి తప్పుపట్టారు. దీనికి ఆయన తరపు న్యాయవాది రంజిత్ కుమార్ జోక్యం చేసుకుని.. రివ్యూ కమిటీ ఉత్తర్వుల మేరకు చేయాల్సి వచ్చిందని బెంచ్‌కు తెలిపారు. డాటాను ధ్వంసం చేయాలని రివ్యూ కమిటీ ఇచ్చిన ఉత్తర్వులను చూపాలని జడ్జి కోరారు. డాటాను డిలీట్ చేయమన్నారు తప్ప ధ్వంసం చేయాలని కమిటీ చెప్పిందా అని ఎదురు ప్రశ్నించారు.
Read Also: ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు నోటీసులు
Follow Us On: Youtube


