కలం, డెస్క్ : “నేను గుంటూరులో చదువుకోలేదు.. నాకు గూడుపుఠాణి తెలియదు.. నాకు విదేశీ భాష రాకపోవచ్చు.. కానీ నాకు పేదవాడి మనసు చదవడం వచ్చు.. పేదలకు సంక్షేమం అందేలా పరిపాలన చేయడం వచ్చు…” ఉస్మానియా యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పై వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీషు భాష ఒక కమ్యూనికేషన్ మాత్రమే.. అది నాలెడ్జ్ కాదన్నారు. మనకు నాలెడ్జ్, కమిట్ మెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. బీఆర్ఎస్ నేతలు పలువురు సీఎం భాషపైనా, డ్రెస్సింగ్‌పైనా కామెంట్లు చేయడంతో దానికి కౌంటర్‌గా పై విధంగా బదులిచ్చారు. పేదలకు, నిస్సహాయులకు సహాయం అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ ముందు భాగాన నిలిచిందని, తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడితే విద్యార్థులు ఎవరి ఆస్తులనో అడగలేదని, ఫామ్ హౌజ్‌లనూ అడగలేదని గుర్తుచేశారు. కేవలం స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు మాత్రమే అడిగారని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అందిస్తున్నదన్నారు.
ఉస్మానియా వర్శిటీపై పదేండ్ల నిర్లక్ష్యం :
ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేయాలని గత ప్రభుత్వం ప్రయత్నించిందని సీఎం ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానంటూ తనను పదేపదే వేలెత్తి చూపే నాయకులకు సూటిగా సమాధానం చెప్పాలనుకుంటున్నానని అన్నారు. “అవును.. నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నా.. గుంటూరులో చదువుకోలేదు.. నాకు ఎలాంటి ఫామ్ హౌజ్‌లూ లేవు.. నేను ప్రజల సొమ్మును దోచుకోలేదు..” అని అన్నారు. ఏ ధైర్యంతో యూనివర్శిటీకి వెళ్తారోనంటూ సెటైర్లు వేశారని, కానీ కావాల్సింది ధైర్యం కాదని, గుండెల నిండా అభిమానమని అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆశీర్వదిస్తేనే ఒక ముఖ్యమంత్రిగా ఇప్పుడు విద్యార్థుల ముందు ఈ యూనివర్శిటీలో నిలబడ్డానని అన్నారు. చేతనైతే ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళాలంటూ ఒకాయన గతంలో సవాల్ విసిరాడని గుర్తుచేశారు.
చరిత్ర గుర్తుంచుకునేలా పరిపాలన అందిస్తా :CM Revanth Reddy
ప్రజలు ఎన్నో ఆశలతో కాంగ్రెస్ పార్టీని ఆదరించారని, గత ప్రభుత్వాన్ని గద్దె దింపారని, వారి ఆకాంక్షలు నెరవేరేలా, ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకునేలా పరిపాలన అందిస్తానని సీఎం రేవంత్ అన్నారు. భూమి లేకపోవడం పేదరికం కావచ్చు.. కానీ చదువు లేకపోవడం మాత్రం వెనుకబాటుతనమే అవుతుందని, ఆ వెనకబాటుతనాన్ని రూపుమాపేదే విద్య అని అన్నారు. ప్రస్తుతం విద్య అందుబాటులో ఉన్నా నాణ్యత లేదన్నారు. విద్య ఒక్కటే మన తలరాతలు మారుస్తుందని, జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. యువత నైపుణ్యాన్ని పెంపొందించేందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పేదలకు మేలు జరగాలన్నదే తన తపన అని, అందుకే రూ. 1000 కోట్లతో ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని సంకల్పించినట్లు వివరించారు. ఈ యూనివర్సిటీ నుంచి విద్యార్థులు నాయకులుగా ఎదిగి రాష్టాన్ని పరిపాలించాలని కోరుకుంటున్నానని అన్నారు.
Read Also: ఆధిపత్యం ప్రదర్శిస్తే తిరుగుబాటు తప్పదు
Follow Us On: X(Twitter)


