కలం, వెబ్‌డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఓయూ అభివృద్ధికి రూ.1000 కోట్ల నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టులో కూడా రేవంత్ రెడ్డి ఉస్మానియాకు వెళ్లి యూనివర్సిటీలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దీంతో 20ఏళ్ల తరువాత ముఖ్యమంత్రి హోదాలో ఓయూకు వెళ్లిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కినట్లయింది.
ఇవాళ (బుధవారం) మరోసారి ఓయూ (Osmania University)లో పర్యటించిన సీఎం రేవంత్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఉస్మానియాలో అడుగుపెట్టేందుకు వెనకాడితే.. రేవంత్ రెడ్డి మాత్రం రెండు సార్లు ఓయూకు వెళ్లారు. దీని వెనుక రేవంత్ పెద్ద వ్యూహమే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఓయూ కేంద్ర బిందువుగా ఉంది. దీంతో పాటు రాష్ట్రంలోని విద్యార్థులను, నిరుద్యోగులను పెద్ద ఎత్తున ప్రభావితం చేయగలదు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. మహిళలకు, విద్యకు, నిరుద్యోగులకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం.. మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణాలను అందజేసింది. మహాలక్ష్మీ పథకం పేరుతో మహిళలను ఆకర్షించింది. ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసింది. అలాగే, విద్య, నిరుద్యోగంపైన కూడా కాంగ్రెస్ ఎక్కువగా ఫోకస్ చేసింది. ఏడాదికి లక్ష ఉద్యోగాలు అంటూ ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి.. ప్రభుత్వం ఏర్పడిన తరువాత వేల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేసింది. దీంతో పాటు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పింది.
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్, అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిలో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే, యువతలో నైపుణ్యం పెంచడానికి ఐటీఐలపై దృష్టి సారించారు. వాటిని అప్‌డేట్ చేస్తూ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ (ఏటీసీ)లుగా మార్చి స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెస్తామని సీఎం ప్రకటించారు. ఈ క్రమంలోనే ఓయూను కూడా అభివృద్ధి చేసేందుకు నిర్ణయించారు. తెలంగాణలో సగానికి పైగా ఉన్న మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులను తమ వైపు తిప్పుకుని రాబోయే ఎన్నికల్లో లాభపడాలని హస్తం పార్టీ నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
Read Also: ఆధిపత్యం ప్రదర్శిస్తే తిరుగుబాటు తప్పదు
Follow Us On: Instagram


