పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)ను వరల్డ్ నెం.1 టీ20 లీగ్‌గా మరుస్తానంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్(PCB) ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) శపథం చేశారు. ఆ దిశగా అడుగులు వేయనున్నట్లు చెప్పారు. లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన పీఎస్‌ఎల్ రోడ్‌షో సందర్భంగా నఖ్వీ తన ఆలోచనలను పంచుకున్నారు. అందులో పీఎస్‌ఎల్‌ను వరల్డ్ నెం.1 టీ20 లీగ్‌గా మార్చడమే తన విజన్ అని వివరించారు. రమిజ్, వసిమ్ లాంటి వాళ్లు ఉన్నప్పుడు ఇది పెద్ద కష్టమైన టాస్క్ అని తాను అనుకోవడం లేదని, మా లక్ష్యాన్ని సాధిస్తామన్న పూర్తి నమ్మకం తనకు ఉందని అన్నారు.
మాజీ క్రికెటర్ల సూచనలు, ప్రస్తుత ఆటగాళ్ల అభిప్రాయాలు లీగ్ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. “రాత్రి రమీజ్ ఇచ్చిన సలహాలు, అలాగే ఈ రోజు బాబర్, హారిస్, ఫర్హాన్‌లతో చర్చలు, ఇవన్నీ అమలు చేయదగినవే” అని చెప్పారు. పీఎస్‌ఎల్ తొలి సీజన్‌ను గుర్తుచేసుకుంటూ, తాను కూడా అప్పట్లో ఒక జట్టును కొనాలని ఆసక్తి చూపానని నక్వీ వెల్లడించారు. “ఒక జట్టుపైనే బిడ్ చేయడం నా తప్పు. అన్ని జట్లకు బిడ్ చేసి ఉంటే కనీసం ఒకటి దొరికేది. ఆ జట్ల విలువ ఇప్పుడు ఎన్నో రెట్లు పెరిగింది” అని ఆయన పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఫ్రాంచైజీ కొనాలనుకునేవారికి ఇది మంచి పెట్టుబడిగా మారుతుందని నక్వీ సూచించారు. “ఇప్పుడే పెట్టుబడిపెడితే, పది సంవత్సరాల తర్వాత అది ఎంతో విలువైనదవుతుంది. కాబట్టి రిస్క్ తీసుకుని జట్టును కొనండి” అని పెట్టుబడిదారులకు సందేశం ఇచ్చారు. 2016లో ఐదు జట్లతో ప్రారంభమైన పీఎస్‌ఎల్ (PSl), 2018లో ముల్తాన్ సుల్తాన్స్‌తో ఆరు జట్లకు విస్తరించింది. ఇప్పుడు రాబోయే ఎడిషన్‌లో మరో రెండు కొత్త జట్లు చేరడంతో మొత్తం ఎనిమిది జట్లు అవనున్నాయి.
Read Also: ఐపీఎల్ వేలం నుంచి 1000 మంది ప్లేయర్లు ఔట్ !
Follow Us On: Youtube


