అమెరికాలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన ఓ విద్యార్థు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో డల్లాస్ లో శనివారం ఉదయం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ ఎల్బీనగర్‌కు చెందిన పోలే చంద్రశేఖర్(Pole Chandrashekar).. బీడీఎస్ పూర్తి చేశాడు. ఉన్నత చదువులు కోసం అమెరికాకు వెళ్లాడు. ఈ విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao).. చంద్రశేఖర్ కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. చంద్రశేఖర్ మృతదేహాన్ని తెలంగాణకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.
‘‘బీడీఎస్ పూర్తి చేసి, పై చదువుల కోసం అమెరికా (డల్లాస్) వెళ్ళిన ఎల్బీనగర్ కు చెందిన దళిత విద్యార్థి చంద్ర శేఖర్ పోలే ఈరోజు తెల్లవారు జామున దుండగులు జరిపిన కాల్పులో మృతి చెందటం విషాదకరం. ఉన్నత స్థాయిలో ఉంటాడనుకున్న కొడుకు ఇక లేడు అన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న అవేదన చూస్తే గుండె తరుక్కు పోతున్నది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని చంద్ర శేఖర్ పార్థీవ దేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేందుకు కృషి చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం’’ అని హరీష్ రావు(Harish Rao) తెలిపారు.

