కలం, ఖమ్మం బ్యూరో : ఎలివేటెడ్ షెడ్ల (Elevated Sheds) వల్ల జీవాల్లో అంటురోగాలు నివారించవచ్చన్నారు. ఖమ్మం కలెక్టర్ జితేష్ వి.పాటిల్ (Collector Jitesh V Patil) మద్దుకూరు గ్రామంలో రైతు తలారి రవి ఏర్పాటు చేసిన ఎలివేటెడ్ మేకలు/గొర్రెల పెంపక షెడ్‌ను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలివేటెడ్ షెడ్ విధానం పశుసంవర్థక రంగంలో ఆధునిక, శాస్త్రీయ పద్ధతి అని, ఈ విధానం ద్వారా జీవుల్లో అంటు వ్యాధులు గణనీయంగా తగ్గుతాయని అన్నారు. ముఖ్యంగా చిన్న మేక/గొర్రె పిల్లల మరణాల శాతం ఈ విధానంతో స్పష్టంగా తగ్గడం శుభపరిణామమని తెలిపారు.

‘ఎలివేటెడ్ ఫ్లోరింగ్ కారణంగా పేడ, మూత్రం నేలపై నేరుగా పడిపోవడం వల్ల ఫ్లోర్ ఎప్పటికప్పుడు పొడిగా, పరిశుభ్రంగా ఉంటుంది. దీని వల్ల తడి లేకుండా ఉండి జీవుల్లో అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు తగ్గుతాయని’ తెలిపారు. పరిశుభ్రత పెరగడం వల్ల జీవాలు ఆరోగ్యంగా పెరిగి, పెరుగుదల శాతం కూడా గణనీయంగా మెరుగవుతుందని చెప్పారు. అలాగే రైతు తలారి రవి స్వయంగా రూపొందించిన గడ్డి కోసే యంత్రం, ఫర్నీచర్ యూనిట్, ఫీడ్ మిక్చర్ లాంటి కొత్త ఆవిష్కరణలను కలెక్టర్ పరిశీలించి అభినందించారు. ఎలివేటెడ్ షెడ్ (Elevated Sheds) నిర్మాణ వివరాలను కలెక్టర్ ఈ సందర్భంగా స్థానికులకు వివరించారు. భూమికి 4–6 అడుగుల ఎత్తులో ఫ్లోర్‌ను ఏర్పాటు చేసి, సుమారు 20–25 మేకలు/గోర్రెల కోసం 21 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పు, 12 అడుగుల ఎత్తుతో షెడ్‌ను నిర్మించవచ్చని సూచించారు. సరైన గాలి ప్రసరణ, వెలుతురు, పొడి వాతావరణం ఉండేలా ఈ షెడ్‌లను డిజైన్ చేస్తే బాగుంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డా.వెంకటేశ్వర్లు, మండల పశుసంవర్ధక అధికారి ఎం.వి సంతోష్, రెవెన్యూ అధికారి సంధ్యారాణి, రైతు తలారి రవి, స్థానిక రైతులు పాల్గొన్నారు.
Read Also: తెలంగాణ 2026 హాలీడేస్ లిస్ట్ రిలీజ్!
Follow Us On: Pinterest


