కలం, వెబ్డెస్క్ : గోదావరి పుష్కరాల (Godavari Pushkaralu)కు రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. 2027 జూలైలో జరగబోయే పుష్కరాలకు భక్తులు పెద్దఎత్తున హాజరవుతారనే అంచనాలు ఉన్నాయి. దీంతో ఇప్పటినుంచే ఏర్పాట్లు ప్రారంభించాల్సి ఉంది. 2015లో జరిగిన గోదావరి పుష్కరాలకు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 4.5కోట్ల మంది తరలివచ్చారని సమాచారం. ఈసారి భక్తుల సంఖ్య 6కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో పుష్కరాల నిర్వహణకు కేంద్రం ఇప్పటికే రూ.94 కోట్ల నిధులు కేటాయించింది. కానీ, తెలంగాణకు మాత్రం సెంట్రల్ నుంచి ఎలాంటి ఫండ్స్ విడుదల కాలేదు. ఇదే అంశంపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పార్లమెంట్ లో ప్రశ్నను లేవనెత్తారు.
ఎంపీ ప్రశ్నకు కేంద్రం సమాధానమిస్తూ పుష్కరాల (Godavari Pushkaralu) నిర్వహణకు నిధులు కావాలంటూ ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి విజ్ఞప్తి అందలేదని పేర్కొంది. గోదావరి తీరం ఉన్న ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి నిర్దిష్టమైన డీపీఆర్, వివరాలు అందలేదని.. అవి వచ్చిన తర్వాత స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని కేంద్ర టూరిజం మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లోక్ సభలో సోమవారం స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ అంశంపై తెలంగాణ వ్యాప్తంగా చర్చ మొదలయింది. ఇన్నాళ్లు పుష్కరాలకు కేంద్రం నిధులు కేటాయించడం లేదని రాష్ట్ర కాంగ్రెస్ విమర్శిస్తూ వచ్చింది. అయితే, కేంద్రం సమాధానంతో తెలంగాణ ప్రభుత్వం ఇరుకున పడినట్లయింది.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ లో పుష్కరాలకు సంబంధించి పనులు ఇప్పటికే మొదలయ్యాయి. అక్కడి ప్రభుత్వం దాదాపు రూ.2వేల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ మాత్రం ఎలాంటి ఏర్పాట్లు మొదలుపెట్టకపోవడంతో భక్తులు పెదవి విరుస్తున్నారు. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. దీంతో ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం నిధుల కోసం కేంద్రాన్ని సంప్రదించాలని భక్తులు కోరుతున్నారు. అలాగే, బీజేపీ ఎంపీలతో పాటు కేంద్రమంత్రులు చొరవ తీసుకుని పుష్కరాల కోసం నిధులు వచ్చేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పుష్కరాలకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తుందో చూడాలి.
Read Also: పిల్లల జీవితాలతో ఆడుకున్నారు.. వైసీపీపై చంద్రబాబు ఫైర్
Follow Us On: Instagram


