epaper
Friday, January 16, 2026
spot_img
epaper

గ్లోబల్ సమ్మిట్ వర్సెస్ విజయ్ దివస్

కలం, వెబ్‌డెస్క్:  తెలంగాణలో రాజకీయం ప్రస్తుతం గ్లోబల్ సమ్మిట్ వర్సెస్ విజయ్ దివస్ (Global Summit vs Vijay Diwas)గా నడుస్తోంది. కాంగ్రెస్ సర్కార్ సోనియా గాంధీ పుట్టిన రోజున గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తుంటే… కేసీఆర్‌ దీక్ష ఫలించిన రోజునే రాష్ట్ర వ్యాప్తంగా ‘విజయ్‌ దివస్‌’ పేరుతో పండుగలా జరుపుకోవాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. దీంతో రెండు కార్యక్రమాలు పోటాపోటీగా సాగుతూ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. కాగా, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్లోబల్‌ సమ్మిట్‌ను (Global Summit) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దావోస్ ఆర్థిక సదస్సుకు దీటుగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ప్రపంచవ్యాప్తంగా 44 దేశాల నుంచి ప్రతినిధులు ఈ సమ్మిట్‌కు రాబోతున్నారు. లక్షకోట్లకు మించి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకోబోతున్నది. సీఎం రేవంత్ రెడ్డి కలలు కన్న భావి మహానగరం భారత్ ఫ్యూచర్‌సిటీ ఈ కార్యక్రమానికి వేదిక కాబోతున్నది.

అయితే ఇంత ప్రతిష్ఠాత్మక కార్యక్రమం కచ్చితంగా సక్సెస్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. తెలంగాణకు భారీగా పెట్టుబడులు రావడం ఖాయమన్న సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఇదే సమయంలో ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు బీఆర్ఎస్ ఆపసోపాలు పడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. తమ ఉనికి కోసం పాకులాడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న రోజే హరీశ్ రావు మీడియా సమావేశం పెట్టి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోయడం గమనార్హం. ఇక డిసెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ దివస్ జరుపుకోవాలని కేటీఆర్ పిలుపునివ్వడం గమనార్హం.

గులాబీ పార్టీ ఉక్కిరిబిక్కిరి

గ్లోబల్ సమ్మిట్ (Global Summit) వేళ బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాజకీయంగా ఆ పార్టీ బలహీనంగా మారింది. అధినేత కేసీఆర్ బయటకు రావడం లేదు. ఆయన ప్రజల్లో ఉండకపోతే పార్టీ మరింత బలహీనపడటం ఖాయం. మరోవైపు తానే హైదరాబాద్ ను బాగా అభివృద్ధి చేశానని ఇంతకాలం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకున్నారు. కాంగ్రెస్ సర్కారు చేసిందేమీ లేదని విమర్శలు గుప్పించారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయితే రేవంత్ సర్కార్ పేరు చారిత్రాత్మకంగా నిలిచిపోనున్నది. దీంతో బీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేకపోతున్నదన్న విమర్శలు వస్తున్నాయి. అందులో భాగంగానే విజయ్ దివస్ కార్యక్రమానికి పిలుపునిచ్చి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయడం వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యిందని మరోసారి చెప్పేందుకు సిద్ధమైంది.

ప్రజలు మరిచిపోవద్దని..

కేసీఆర్ ప్రస్తుతం ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. అడపదడపా కొందరు నేతలతో సమావేశం అవ్వడం మినహా పెద్దగా రాజకీయ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవ్వడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ పేరును ప్రజలు మరిచిపోవద్దన్న ఉద్దేశ్యంతో బీఆర్ఎస్ పార్టీ విజయ్ దివస్ పేరుతో డిసెంబర్ 9న ఊరూరా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. కేసీఆర్‌ దీక్ష ఫలించిన రోజునే రాష్ట్ర వ్యాప్తంగా ‘విజయ్‌ దివస్‌’ పేరుతో పండుగలా జరుపుకోవాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేయాలని ప్రజలకు ఉద్యమం నాటి రోజులు గుర్తు చేయాలని కేటీఆర్ పిలపునిచ్చారు.

బీఆర్ఎస్ తీరుపై విమర్శలు

గ్లోబల్ సమ్మిట్ (Global Summit) అనేది ప్రభుత్వం ఆధ్వర్యంలో సాగుతున్న ఒక గొప్ప కార్యక్రమం. ఈ సమ్మిట్ అనంతరం రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే తెలంగాణలో ఉపాధి కల్పన పెరుగుతుంది. రాష్ట్రానికి ఆదాయం కూడా వస్తోంది. ఇటువంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు నిర్వహించినప్పుడు పార్టీలకతీతంగా మద్దతు పలకాలి తప్ప.. రాజకీయం చేయడం తగదన్న విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలు తెలివిగా వ్యవహరిస్తున్నారు. నేరుగా గ్లోబల్ సమ్మిట్ మీద విమర్శలు చేయకుండా ఇతర అంశాలను తెరమీదకు తీసుకొస్తున్నారు.

ప్రతి ఏడాది నవంబర్ 29న కేసీఆర్ దీక్ష ప్రారంభించిన రోజును దీక్షా దివస్ గా జరుపుకొనేవారు. కానీ ఈ సారి అందుకు భిన్నంగా డిసెంబర్ 9న కూడా సంబురాలు జరుపుకుండుటం గమనార్హం. మరోవైపు హరీశ్ రావు కూడా గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న రోజే తెలంగాణ భవన్ లో మీటింగ్ పెట్టి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుండటంతో బీఆర్ఎస్ లీడర్లు జీర్ణించుకోలేకే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల గ్లోబల్ సమ్మిట్ వర్సెస్ విజయ్ దివస్ (Global Summit vs Vijay Diwas) రాజకీయంగా రసవత్తరంగా మారింది.

Read Also: గ్లోబల్ సమ్మిట్‌ గెస్టులకు రోబో వెల్‌కమ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>