కలం, వెబ్ డెస్క్ : BRS Poster Politics | ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా గ్లోబల్ సమ్మిట్ (Global Summit) మీదే చర్చ జరుగుతోంది. మీడియాలో మొత్తం ఇవే వార్తలు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. లక్ష కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే తమ లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను మంత్రులు ఆహ్వానిస్తున్నారు. ఒక్కో మంత్రి ఒక్కో కీలక బాధ్యత చూసుకుంటున్నారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగే గొప్ప కార్యక్రమం కావడంతో ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రానికి దాదాపుగా లక్ష కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకోవడమే లక్ష్యంగా గ్లోబల్ సమ్మిట్ (Global Summit) సాగుతోంది. అయితే బీఆర్ఎస్ మాత్రం ఈ సమయంలో కూడా ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తోంది. సోషల్ మీడియాలో పోస్టర్లు విడుదల చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.
గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయితే కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరిగితే .. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో అంతా విధ్వంసమేనని ఆ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఓ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంలో .. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ విశ్వవ్యాప్తం అవుతున్న సందర్భంలో పార్టీలకతీతంగా మద్దతు పలకాలి తప్ప.. విష ప్రచారం చేయడం తగదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
ముఖ్యమంత్రి అనేక సభలు, సమావేశాల్లో హైదరాబాద్ అభివృద్దికి బీఆర్ఎస్ చేసిందేమీ లేదని విమర్శించారు. సచివాలయం, ప్రగతి భవన్, కమాండ్ కంట్రోల్ కట్టడం మినహా ఆ పార్టీ కొత్తగా నిర్మించింది ఏమీ లేదని ఆరోపించారు. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని రేవంత్ రెడ్డి పదే పదే ప్రచారం చేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ అటాక్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.
బీఆర్ఎస్ పోస్టర్ల రాజకీయం (BRS Poster Politics) :
పదేండ్ల ప్రగతి అంటూ బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్, అంబేద్కర్ భారీ విగ్రహం, సచివాలయం, ఫ్లైఓవర్లు, కొత్త రహదారులకు సంబంధించిన చిత్రపటాల పోస్టర్లను ఆ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాంగ్రెస్ పాలనలో కేవలం విధ్వంసం జరిగిందని విమర్శిస్తోంది. కాంగ్రెస్ పాలనలో జరిగిన హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన చిత్రాలను, బాధితుల రోధనలకు సంబంధించిన ఫొటోలను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది.
ఇక బీఆర్ఎస్ పాలనలో 6 సార్లు మెర్సెర్ , మోస్ట్ లివబుల్ సిటీ అవార్డు హైదరాబాద్ కు దక్కిందని.. 2 సార్లు ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ అవార్డు, 2022లో వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డును బీఆర్ఎస్ పాలనలో గెలుచుకున్నామని ఆ పార్టీ ప్రచారం చేస్తోంది. అయితే ప్రస్తుతం గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న సందర్భంలో విదేశీ ప్రతినిధులు, పెట్టుబడిదారులు రాష్ట్రానికి వస్తున్న సందర్భంలో ఇటువంటి ప్రచారాలు చేయడం, రాజకీయాలు చేయడం సరికాదన్న విమర్శలు వస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ నేతలు ఎక్కడా గ్లోబల్ సమ్మిట్ (Global Summit) విషయంలో నోరు మెదపడం లేదు.. కానీ ఆ పార్టీ అనుకూల సోషల్ మీడియాలో ఇటువంటి ప్రచారాలు చేస్తుండటం గమనార్హం.
Read Also: 3 ట్రిలియన్ డాలర్లంటే ఎంతో తెలుసా?
Follow Us On: Facebook


