కలం డెస్క్ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఏ అంశంపైన కూడా కనీస అవగాహన లేదంటూ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు గుప్పించారు. అబద్ధాలు చెప్పడం ఒక్కటే జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య అంటూ చురకలంటించారు. అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు నీటిపారుదల శాఖను భ్రష్టుపట్టించారని, శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ఎత్తు పెంచాలనుకుంటున్న ఆల్మట్టి డ్యామ్ గురించి జగన్‌కు ఆవగింజంత విషయం కూడా తెలియదని ఎద్దేవా చేశారు. 50 వేల కోట్ల పంట నష్టానికి కారణమైన చరిత్ర హీనుడు జగన్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు నిమ్మల. అలాంటి జగన్ వచ్చి ఇప్పుడు ఆల్మట్టి గురించి ఆందోళన చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని సెటైర్లు వేశారు.
ఆల్మట్టి ఎత్తును పెంచాలన్న కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం మొదటి నుంచి అడ్డుకుందని, ఇందులో భాగంగా న్యాయవ్యవస్థను కూడా ఆశ్రయించడానికి కూడా వెనకాడదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి న్యాయం చేయడానికి ప్రభుత్వం ఇప్పటికీ పోరాటాన్ని కొనసాగిస్తోందని తెలిపారు.

