మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య(Gummadi Narsaiah) జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ టైటిల్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈ సినిమా లాంచింగ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివ రాజ్ కుమార్ భావోద్వేగానికి గురయ్యారు. వేదికపై గుమ్మడి నర్సయ్య కాళ్లకు నమస్కరించారు. ఆయనను చూస్తుంటే తన తండ్రిని చూసినట్టే ఉందని ఎమోషనల్ అయ్యారు. నర్సయ్య జీవితం ఎందరికో ఆదర్శమని కొనియాడారు.
ఆకట్టుకున్న శివరాజ్ కుమార్ స్పీచ్
శివ రాజ్‌కుమార్(Shiva Rajkumar) చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకున్నది. మంచి మనిషి జీవితాన్ని పెద్ద తెరపై చూపించే అవకాశం రావడం గర్వకారణంగా భావిస్తున్నట్లు తెలిపారు. ‘మనం మన కోసం కాదు ఇతరుల కోసం బతకాలని మా నాన్న చెప్పేవారు. నర్సయ్య(Gummadi Narsaiah)ను చూశాక నిజంగా అదే భావన వచ్చిందన్నారు. ఆయన ఇంటికి వెళ్లినప్పుడు మా ఇల్లు చూసినట్టు అనిపించింది’ అని చెప్పారు. నర్సయ్యను చూసినప్పుడు సొంత మనుషులను కలిసిన భావన కలిగిందని, ఆయన జీవితాన్ని తాను ఎంతో గౌరవంతో పోషిస్తానని తెలిపారు. శివ రాజ్‌కుమార్ కార్యక్రమంలో ఎక్కువ భాగం తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ‘తప్పుగా మాట్లాడినా ఏమీ అనుకోకండి. తర్వాత వచ్చినప్పుడు ఇంకా బాగా మాట్లాడతాను. ఈ సినిమాకు డబ్బింగ్ నేనే చెప్తా’ అని చెప్పడంతో ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సినిమా రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు గొప్ప ప్రేరణగా నిలుస్తుందన్నారు. నర్సయ్య కథను దేశం మొత్తం చూడాలని కోరుకున్న మేకర్స్ ఈ చిత్రాన్ని పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారన్నారు. గుమ్మడి నర్సయ్య బయోపిక్‌లో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి పరమేశ్వర్ దర్శకత్వం వహిస్తుండగా, ఎన్ సురేష్ రెడ్డి ప్రవళ్లిక బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
నా మొదటి సినిమా వేడుక ఇదే.. కోమటిరెడ్డి
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. సినిమాటోగ్రఫీ మంత్రిగా ప్రమాణ స్వీకారంచేసి రెండేండ్లైనా ఇప్పటి వరకూ ఒక్క సినిమా ఫంక్షన్‌కి కూడా వెళ్లలేదని.. ఇదే తన మొదటి సినిమా అని పేర్కొన్నారు. గుమ్మడి నర్సయ్య ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న దేవుడని కొనియాడారు. ఇప్పటికీ ఆయన పింఛన్ పార్టీ ఫండ్‌గా ఇస్తారని గుర్తు చేశారు. వారసత్వంగా వచ్చిన రెండు ఎకరాలు సాగు చేసుకుంటూ ప్రజా పోరాటాలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఇప్పటికీ ఆయన సైకిల్‌పై తిరగడం నిరాడంబరతకు చిహ్నమని కొనియాడారు.
ఈ సినిమా నా స్వభావాన్ని ప్రతిబింబించాలి
అనంతరం గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ.. ఈ చిత్రం తన స్వభావాన్ని ప్రతిబింబించాలన్నారు. ఈ చిత్రాన్ని దేశ ప్రజలందరూ చూసి మార్పుకు నాంది పలుకుతారని భావిస్తున్నానన్నారు. డైరెక్టర్ పరమేష్ మూడేళ్ల కృషి ఈ సినిమా అన్నారు. ప్రొడ్యూసర్ సురేష్ విజయం సాధించాలని కోరుకుంటున్నా ఆన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
Read Also: అఖండ 2 ఇష్యూ.. రంగంలోకి దిల్ రాజు..
Follow Us On: X(Twitter)


