అడుగు బయటపెడితే క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకుంటామో లేదో తెలియదు. ఎక్కడ ఏ రోడ్డు మీద.. ఏ వాహనం రూపంలో మృత్యువు పొంచి ఉందో అర్థం కాదు. కాలి నడకన వెళ్లినా భద్రంగా తిరిగొస్తామని గ్యారెంటీ లేదు. కర్మ కాలితే సొంత వాహనమే శవపేటికవుతుంది. గతేడాది దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల (Road Accidents)పై కేంద్రం నివేదికను చూస్తే బోధపడే నిజమిది. పార్లమెంట్ వేదికగా కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ రిపోర్ట్ వెల్లడించారు.
మరణాలు 2.3శాతం పెరుగుదల..
కేంద్రం నివేదిక ప్రకారం 2024లో దేశవ్యాప్తంగా అన్ని రకాల రహదారుల్లోనూ కలిపి 1,77,177 మంది ప్రాణాలు కోల్పోయారు.అంటే సగటున రోజుకు 485, గంటకు 20 మంది చొప్పున మరణించారు.కాగా, 2023లో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ జరిగిన ప్రమాదాల్లో చనిపోయిన వారి సంఖ్య 1,72,890 మంది.దీని ప్రకారం 2024లో 2.3శాతం మేర మరణాలు పెరిగాయి. ప్రపంచ సగటు ప్రకారం 2024లో చైనాలో రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి లక్ష మందికి ప్రాణాలు కోల్పోతున్న వారి శాతం 4.3 కాగా, అమెరికాలో 12.76. మన దేశంలో 11.89శాతం.
తెలంగాణలో..
తెలంగాణలోనూ 2023తో పోలిస్తే 2024లో రోడ్డు ప్రమాదాలు (Road Accidents), మరణాల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలోని అన్ని రకాల రహదారుల్లోనూ కలపి 2023లో 22,903 ప్రమాదాలు జరగ్గా, 7,660మంది మరణించారు. 2024లో 25,986 ప్రమాదాల్లో 7949 మంది మరణించారు.
కట్టడికి 4ఈ సూత్రం:
దేశంలో రోడ్డు ప్రమాదాల కట్టడికి ’4ఈ‘ సూత్రాన్ని కేంద్రం అమలు చేయనుంది.4ఈ అంటే ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్ మెంట్, ఎమర్జెన్సీ కేర్. అంటే రోడ్డు, వాహనాల డిజైన్ మెరుగుపర్చడం (ఇంజనీరింగ్); ట్రాఫిక్ నియమాలను కఠినంగా అమలు చేయడం (ఎన్ఫోర్స్ మెంట్); ప్రజలకు అవగాహన కల్పించడం, చైతన్యపర్చడం (ఎడ్యుకేషన్); ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ వైద్య సహాయం (ఎమర్జెన్సీ కేర్) అందేలా చేయడమే 4ఈ సూత్రం. 2020లో జరిగిన స్టాక్ హోమ్ డిక్లరేషన్ ప్రకారం 203 నాటికి రోడ్డు ప్రమాదాలను, మరణాలను 50శాతం వరకు తగ్గించడమే లక్షంగా పనిచేస్తున్నట్లు కేంద్రం చెబుతున్నా వాస్తవ లెక్కలు అందుకు విరుద్దంగా కనిపిస్తున్నాయి.
Read Also: మేడారం జాతరకు శరవేగంగా ఏర్పాట్లు
Follow Us On: Pinterest


