కలం డెస్క్ : Ghost Employees | ప్రభుత్వంలో వాస్తవంగా పనిచేస్తున్న ఉద్యోగులెంతమంది?.. రికార్డుల్లో ఉండే ఉద్యోగులెంతమంది?.. ప్రతి నెలా జీతాలు అందుకుంటున్నది ఎంతమంది?.. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల రికార్డుల్లో ఉండేది ఎందరు?.. డిపార్టుమెంట్ల నుంచి శాలరీ పేరుతో విడుదలవుతున్న నిధులెన్ని?.. ఇలాంటి అంశాలపై విజిలెన్స్(Vigilance) అధికారులు దృష్టి పెట్టారు. ఎంక్వయిరీ చేస్తున్న క్రమంలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. అన్ని డిపార్టుమెంట్ల నుంచి ఉద్యోగుల వివరాలను పంపించాలంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ జారీ చేసిన సర్క్యులర్‌కు సమాధానంగా వచ్చిన వివరాలను విశ్లేషించిన సందర్భంగా అనేక అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. తప్పుడు లెక్కలు చూపి ఖజానా నుంచి డ్రా చేస్తున్న డబ్బు అటు అధికారులు, ఇటు ఏజెన్సీల నిర్వాహకుల మధ్య కుమ్మక్కుతో వారి జేబుల్లోకి చేరుతున్నదనే ప్రాథమిక అంచనా నెలకొన్నది.
డాటా బేస్‌లో ఎక్కువ… విధుల్లో తక్కువ :
రాష్ట్ర ఫైనాన్స్ డిపార్టుమెంటు దగ్గర ఉన్న డాటా బేస్‌లో కనిపించే ఉద్యోగుల సంఖ్యకు, క్షేత్రస్థాయిలో వివిధ ఆఫీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. కాగితాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగులు కనిపిస్తున్నా ఫీల్డులో మాత్రం అంత సంఖ్యలో లేరని కొన్ని డిపార్టుమెంట్ల కేస్ స్టడీలో తేలింది. ఔట్సోర్సింగ్ కేటగిరీలో మాత్రమే కాక కాంట్రాక్టు ఉద్యోగులుగా రూపొందిన లెక్కల్లో తేడాలున్నాయి. ఓన్లీ పేపర్స్ మీద, రికార్డుల్లో ఉన్నంత సంఖ్యలో యాక్టివ్ ఉద్యోగులు(Ghost Employees) లేరని తేలింది. ఇలాంటి లొసుగులను అధ్యయనం చేసి నివేదిక సమర్పించాల్సిందిగా రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి నేతృత్వంలో ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఫైనాన్స్ డిపార్టుమెంటు దగ్గర ఉన్న డాటాలోని వివరాల్లో తేడాలున్నట్లు ఆమె గుర్తించారు.
హెల్త్, ఎడ్యుకేషన్, మున్సిపల్ శాఖల్లో.. :
కేవలం కాగితాల మీద కనిపించే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వాస్తవానికి పనిచేయడం లేదని, ఎక్కువగా ఈ గోల్మాల్ వ్యవహారం హెల్త్, ఎడ్యుకేషన్, పంచాయితీ రాజ్, మునిసిపల్ శాఖల్లో ఉన్నట్లు స్పష్టమైంది. వీటిలో దాదాపు 10 వేల మంది కేవలం ‘కాగితపు ఉద్యోగులు’గానే ఉన్నట్లు తేలింది. వివిధ డిపార్టుమెంట్ల నుంచి ఫైనాన్స్ డిపార్టుమెంటుకు చేరిన డాటాబేస్, వారికి చెల్లిస్తున్న వేతనాలు, ఆయా శాఖల తరఫున ఉద్యోగులకు జరుగుతున్న శారీ పేమెంట్.. ఈ చెల్లింపులు, లెక్కలు, రికార్డులు, ఇతర సమాచారం మొత్తంలో భారీ స్థాయిలో వ్యత్యాసం ఉన్నట్లు తేలంది. తదుపరి దర్యాప్తు కోసం ఈ వివరాలన్నింటినీ విజిలెన్స్ అధికారులకు ఫైనాన్స్ డిపార్టుమెంట్ అందివ్వనున్నది. ఔట్సోర్సింగ్ ఏజెన్సీల నిర్వాహకులు, వివిధ డిపార్టుమెంట్ల హెచ్ఓడీల మధ్య ఉన్న లోపాయకారీ ఒప్పందాలు, కమిషన్ల పేరుతో పంచుకుంటున్న తీరుపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశమున్నది.
Read Also: అందంగా ఉంటే హత్యే.. కొడుకుని కూడా వదలని తల్లి!!
Follow Us On: Facebook


