epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రెండేళ్లలో 61,379 ఉద్యోగాల భర్తీ

కలం డెస్క్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఏర్పడి మరో నాలుగు రోజుల్లో రెండేండ్లు పూర్తవుతున్న సందర్భంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై సమీక్ష చేసిన వివిధ శాఖల మంత్రులు, అధికారులు ప్రగతి నివేదికను రూపొందించారు. రెండేండ్ల కాలంలో 61,379 ఉద్యోగాలను వివిధ శాఖల్లో భర్తీ చేసినట్లు ఆ నివేదికలో పేర్కొన్నది. మరో 8,632 జాబ్స్ భర్తీ ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు వెల్లడించింది. లక్ష ఉద్యోగాల మైలురాయిని పూర్తిచేసే డైరెక్షన్‌లో ప్రభుత్వం ప్రయాణిస్తున్నదని ఆ నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలకు తెలంగాణ చిరునామాగా మారిందని పేర్కొన్నది. యువతకు ఉద్యోగం.. తెలంగాణ భావోద్వేగం.. అనే స్లోగన్‌తో ప్రభుత్వం తన విజయాలను ఈ నెల 8న జరిగే కార్యక్రమంలో వెల్లడించనున్నది.

కొలువుల పండుగలో సీఎం రేవంత్ :

ఏళ్లకేళ్లుగా నియామకాలకు నోచుకోక తల్లడిల్లిన తెలంగాణ నిరుద్యోగ యువత భవిష్యత్తుకు భద్రత కల్పించిన రాష్ట్ర సర్కార్ 13 కొలువుల పండుగలను నిర్వహించి నిరుద్యోగులకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తన చేతుల మీదుగా నియామక పత్రాలను అందించి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఉద్యోగాల భర్తీలో తెలంగాణ ప్రభుత్వం ఈ రెండేండ్లలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 61,379 ఉద్యోగాలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేసింది. మరో 8632 పోస్టుల నియామకాలు తుది దశలో ఉన్నందున వీటితో కలిపి మొత్తం ఉద్యోగ నియామకాల సంఖ్య 70,011కు చేరుకుంది. త్వరలోనే లక్ష ఉద్యోగాల మైలురాయిని అందుకునేలా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు మిగతా రాష్ట్రాలకు సైతం ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయని నివేదిక వెల్లడించింది. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కీలక రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చినట్లయింది.

పబ్లిక్ సర్వీస్ కమిషన్ దూకుడు :

గత ప్రభుత్వంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలు, జవాబు పత్రాల వాల్యుయేషన్, ఫలితాల వెల్లడి, ర్యాంకుల జాబితా… ఇలాంటివాటిలో అవకతవకలు జరగడంతో నిరుద్యోగుల్లోని ఆందోళనను పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) యూపీఎస్సీ తరహాలోనే స్టేట్ కమిషన్ కూడా ఉండాలని భావించి ప్రక్షాళన చేపట్టింది. పెండింగ్‌లో ఉన్న పరీక్షలు, ఫలితాలకు న్యాయస్థానాల్లో ఉన్న అడ్డంకులను తొలగించి ఉద్యోగాల భర్తీకి చొరవ తసుకున్నది. పదేండ్ల పాటు నియామకాలు లేకపోవడంతో ఏజ్ బార్ అయిపోయిందనే ఆందోళనకు పరిష్కారంగా నియామకాల వయో పరిమితిని సడలించింది. దీనికి తోడు వార్షిక జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించింది. సివిల్ సర్వీసెస్ తరహాలో తెలంగాణలో గ్రూప్-1 రిక్రూట్మెంట్ను విజయవంతంగా నిర్వహించి ఎంపికైన 562 మంది విజేతలకు, గ్రూప్-2 కేటగిరీలో 782 మందికి శిల్పకళావేదికలో సీఎం నియామక పత్రాలను అందజేశారు. గ్రూప్-3 విభాగంలో 1365 పోస్టుల భర్తీ కోసం ప్రస్తుతం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. త్వరలో పోస్టింగులు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక గ్రూప్-4 కేటగిరీలో పెద్దపల్లిలో మొత్తం 8,143 మంది ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను సీఎం అందించారు.

మెగా డీఎస్సీతో 11 వేల మంది టీచర్లు :

టీజీపీఎస్సీ నోటిఫికేషన్‌ల ద్వారా రెండేండ్లలోనే 15,780 ఉద్యోగ నియామకాలు భర్తీ కాగా, ఇతర విభాగాల్లో 6293 పోస్టుల భర్తీ పూర్తయింది. మెగా డీఎస్సీతో 11,062 పోస్టులు భర్తీ అయ్యాయి. రెసిడెన్షియల్ సొసైటీల పరిధిలో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులన్నీ కలిపి 8,400 మందికి నియామక పత్రాలు అందాయి. కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రీ ప్రైమరీ తరగతులకు క తాత్కాలిక పద్ధతిన నియామకాలు చేపట్టింది. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా కానిస్టేబుల్ పోస్టుల నియామకాలకు ఉన్న అడ్డంకులన్నింటీనీ అధిగమించి ఎంపికైన 16,067 మంది విధుల్లో చేరారు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 8,666 మంది ఉద్యోగాల్లో చేరారు. మరో 7,267 పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నందున వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయి.

 Read Also: దేవుళ్లపై వివాదాస్పద కామెంట్లు.. స్పందించిన రేవంత్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>