ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మొత్తం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ ఫర్మేషన్ పాలసీ(HILT Policy) చుట్టూ తిరుగుతున్నాయి. ఈ పాలసీ పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ అవినీతికి తెరలేపిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మొదటి నుంచి బీఆర్ఎస్ ఈ పాలసీని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బీజేపీ సైతం విమర్శలు గుప్పించింది. ఇప్పటికే బీజేపీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ పోరుబాటకు సిద్ధమైంది. హిల్ట్ పేరుతో విలువైన భూములను తక్కువ ధరకే వ్యాపారవేత్తలకు కట్టబెడుతున్నారని.. ఈ పాలసీతో ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లితుందని.. అలాగే ప్రైవేటు వ్యక్తులకు లాభం కలుగుతుందని.. వారి ద్వారా పరోక్షంగా కాంగ్రెస్ నేతలు లబ్ధిపొందుతారన్నది బీఆర్ఎస్ ఆరోపణ. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. హైదరాబాద్‌ను కాలుష్యరహితం చేసి పరిశ్రమలను నగరానికి దూరంగా తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. అయితే తాజాగా బీఆర్ఎస్ పార్టీ హిల్ట్ పాలసీపై పోరుబాటకు సిద్ధమైంది.
బీఆర్ఎస్ నిజనిర్ధారణ కమిటీ
హిల్ట్ (HILT Policy) అంశంపై కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8 నిజ నిర్ధారణ బృందాలను ఏర్పాటు చేసింది. పారిశ్రామిక వాడలను క్లస్టర్లుగా విభజించి డిసెంబర్ 3, 4 తేదీల్లో నిజనిర్ధారణ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి మార్కెట్ ధరలకు, ప్రభుత్వం ఇస్తున్న ధరలకు మధ్య ఉన్న తేడాలను ప్రజలకు వివరించనున్నారు. హైదరాబాద్ పరిధిలోని సుమారు 9,300 ఎకరాల పారిశ్రామిక భూములను మార్కెట్ విలువతో పోల్చితే చాలా తక్కువ ధరలకు రెగ్యులరైజ్ చేసి, ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. రాష్ట్రానికి సుమారు రూ.5 లక్షల కోట్ల నష్టం కలిగే అవకాశం ఉందన్నది బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ. ఈ అభియోగాలను ప్రజలకు వివరించేందుకు పార్టీ కార్యాచరణను ప్రారంభించింది. ఈ నిజనిర్ధారణ బృందాల్లో కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, మల్లారెడ్డి వంటి నేతలు ఉన్నారు. ఒక్కో సీనియర్ నేతను ఒక్కో కస్టర్ పరిధిలో నియమించారు.
క్షేత్రస్థాయి పర్యటనలతో ఏం తేలుస్తారు?
హిల్ట్ పాలసీలో ప్రభుత్వం క్రమబద్ధీకరించే భూములకు నిజమైన మార్కెట్ విలువ ఎంత ఉంది? ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ధరలు ఏమిటి? ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏమిటి? అంతిమంగా ప్రభుత్వానికి ఎంతమేర నష్టం వాటిల్లుతుంది? అన్న అంశాలపై బీఆర్ఎస్ నిజనిర్ధారణ కమిటీ తేల్చనున్నది. ఈ అంశాలను నేరుగా ప్రజలకు వివరించబోతున్నారు. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ప్రభుత్వాన్ని హిల్ట్ పాలసీ అంశంలో టార్గెట్ చేయబోతున్నారు? మరి ఈ ఆరోపణలను ప్రభుత్వం ఎలా ఎదుర్కోబోతున్నది? బీఆర్ఎస్ విమర్శలను ఎలా తిప్పికొట్టబోతున్నది? అన్నది వేచి చూడాలి. హిల్ట్ పాలసీ పేరుతో సుమారు 9,300 ఎకరాల భూములను మార్కెట్ రేటు కంటే అతి తక్కువ ధరకు రెగ్యులరైజ్ చేసి రూ.5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకునే కుట్ర జరుగుతుందని ఇప్పటికే కేటీఆర్ ఆరోపించారు.
Read Also: అమల్లోకి లోక్‌భవన్ గా రాజ్‌భవన్… ‘సేవాతీర్థ్’ గా PM ఆఫీస్
Follow Us On: instagram


