తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని నేలమట్టం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యానించారు. తాము అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గరకు నిత్యం వెళుతూనే ఉంటామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్ని సార్లైనా కేంద్రం దగ్గరకు వెళ్తామన్నారు. అడగడం తమ బాధ్యత కాబట్టి అడుగుతూనే ఉంటామన్నారు. రాష్ట్రానికి సంబంధించిన నిధులు ఇవ్వడం కేంద్రం బాధ్యత అని గుర్తు చేశారు. కేంద్రం తమ అభ్యర్థనలను పట్టించుకోకపోతే కొట్లాడతామని చెప్పారు. తెలంగాణ ప్రజలకు పోరాటాలు కొత్త కాదని గుర్తు చేశారు.
మంగళవారం గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఇటీవల కొత్తగా ఎన్నికైన డీసీసీ అధ్యక్షులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత డీసీసీ అధ్యక్షులదేనని గుర్తు చేశారు. రాష్ట్ర స్థాయిలో పీసీసీ అధ్యక్షుడు, జిల్లా స్థాయిలో డీసీసీ అధ్యక్షుడు ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
విబేధాలు పక్కనపెట్టండి..
జిల్లాకు సంబంధించినంత వరకు డీసీసీ అధ్యక్షుడే పార్టీకి బాస్ అని గుర్తు చేశారు. సీనియర్ నేతలను కలుపుకొని ముందుకుసాగాలని సూచించారు. విబేధాలు ఉంటే వెంబడే పరిష్కరించుకోవాలని సూచించారు. రాజకీయాల్లో కాళ్లల్లో కట్టెలు పెట్టేవాళ్లు ఉండటం సహజమేనని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ లాంటి నేతకే సీనియర్ల నుంచి ఇబ్బందులు తప్పలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో అంత స్వేచ్ఛ ఉంటుందని గుర్తు చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇంతకాలంగా దేశంలో మనుగడ కొనసాగిస్తోందన్నారు.
ఇందిరమ్మ చీరలకు ఫుల్ క్రేజ్..
గత ప్రభుత్వం తీసుకొచ్చిన బతుకమ్మ చీరలను మహిళలు కట్టుకోలేదని రేవంత్ రెడ్డి (Revanth Reddy) వాఖ్యానించారు. కేసీఆర్ పంచిన చీరలు బాగాలేవని అప్పట్లో మహిళలు గగ్గోలు పెట్టారని పేర్కొన్నారు. ఇప్పుడు ఇందిరమ్మ చీరల కోసం పోటీపడుతున్నారని పేర్కొన్నారు. కచ్చితంగా ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ చీరలు అందరికీ పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
కేంద్రం బెదిరింపు ధోరణి..
నేషనల్ హెరాల్డ్ కేసు(National Herald Case) పేరుతో కేంద్ర ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని రేవంత్ విమర్శించారు. దేశవ్యాప్తంగా ఓట్ చోరీ ఆరోపణలను డైవర్ట్ చేసేందుకే కేంద్రం నేషనల్ హెరాల్డ్ కేసును ముందుకు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామని ముఖ్యమంత్రి చెప్పారు. నగరంలోని పేద, మధ్య తరగతి ప్రజలకు ఇండ్లు, భూములు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తాము కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షోభం దిశ నుంచి సంక్షేమం వైపు నడిపిస్తున్నామన్నారు. మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని పునరుద్ఘాటించారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని డీసీసీ అధ్యక్షులు జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు.
Read Also: తెలంగాణలో 30 లక్షల మందికి పీఎం కిసాన్ సాయం
Follow Us on: Facebook


