స్మార్ట్ ఫోన్లలో ‘సంచార్ సాథీ(Sanchar Saathi App)’ యాప్ తప్పనిసరి చేస్తూ టెలికాం శాఖ ఆదేశాలు జారీ చేయడంపై వినియోగదారుల్లో కొత్త అనుమానం మొదలైంది. తమ వివరాలు, వ్యక్తిగత గోప్యత భద్రమేనా?అనే సందేహం వారిలో వ్యక్తమవుతోంది. ప్రతి స్మార్ట్ ఫోన్ కంపెనీ తమ మొబైల్స్ లో ‘సంచార్ సాథీ’ యాప్ ను ఇన్ బిల్ట్‌గా అందించాలని, ఈ యాప్ ను తొలగించడానికి లేదా కనిపించకుండా చేయడానికి అవకాశం ఇవ్వొద్దని ఇటీవల కేంద్ర ప్రభుత్వం తమ ఆదేశాల్లో మొబైల్ కంపెనీలను ఆదేశించింది. స్మార్ట్ ఫోన్ పోగొట్టుకున్నా, లేదా దొంగతనానికి గురైనా ఐఎంఈఐ నెంబరు ఆధారంగా ఈ యాప్ సాయంతో సంబంధిత స్మార్ట్ ఫోన్ సిమ్ బ్లాక్ చేయడంతో పాటు ఫోన్ పనిచేయకుండా చేయొచ్చు. అంతేకాదు, ఒక వ్యక్తి పేరు మీద ఎన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయో తెలుసుకోవచ్చు. అనుమానాస్పద నెంబర్లపై రిపోర్ట్ చేయొచ్చని ప్రభుత్వం చెబుతోంది.
అయితే, ఈ యాప్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేయడంపై దురుద్దేశాలు ఉన్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ‘ప్రజల గోప్యతను పరిరక్షించాలని రాజ్యాంగం చెబుతోంది. సుప్రీం కోర్టు కూడా ఇదే విషయాన్ని పలుసార్లు స్పష్టం చేసింది. కానీ సంచార్ సాథీ యాప్(Sanchar Saathi App) ద్వారా దేశంలోని 120 కోట్ల మొబైల్ వినియోగదారుల గోప్యతకు భంగం కలుగుతుంది. ఒక రకంగా ఇది ప్రజలపై నిఘా పెట్టడమే’ అని కాంగ్రెస్ రాజ్య సభ సభ్యుడు జాన్ బ్రిటాస్ తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల్లోనూ ఈ యాప్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కారణం.. ఈ యాప్ ఐఎంఈఐ, మొబైల్ నెంబర్, సిమ్ వివరాలు, డివైజ్ సమాచారం మాత్రమే కాకుండా కాల్స్, మెసేజ్‌లు, ఫొటోలు/ఫైళ్లు, కెమెరా వంటి వాటి సమాచారం అడగడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వీటన్నిటికీ యాప్‌లో అనుమతి ఇవ్వడం వ్యక్తిగత సమాచారం సేకరించడమేనని భావిస్తున్నారు. ప్రైవసీ పాలసీ ప్రకారం వీటి వివరాలు పంచుకోబోమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, అవసరమైన సందర్భాల్లో డేటాను వాడుకోవచ్చు. ఈ యాప్‌ను ఫోన్ ఆన్ చేసినప్పటి నుంచి శాశ్వతంగా మొబైల్‌లో ఉంటుంది. ఈ క్రమంలో సంచార్ సాథీ యాప్ ప్రజల్లో అనుమానాన్ని, కేంద్రం, ప్రతిపక్షాల మధ్య సరికొత్త వివాదాన్ని రేకెత్తిస్తోంది.
Read Also: పవన్ కల్యాణ్ కు మంత్రి కోమటిరెడ్డి వార్నింగ్
Follow Us on: Facebook


