కలం డెస్క్ : Jubilee Hills Bypoll | జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ మృతితో జరగనున్న ఉప ఎన్నికలపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. సిట్టింగ్ స్థానం కావడంతో ఉప ఎన్నికల్లోనూ గెలవాలని బీఆర్ఎస్ శాయశక్తులా కృషి చేస్తున్నది. ఇందుకోసం దివంగత ఎమ్మెల్యే భార్యకు టికెట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సానుభూతి కలిసొస్తుందని అంచనా వేస్తున్నది. దీనికి ముందే సర్వేలు నిర్వహించి అనుకూల పవనాలు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చింది. అదే సమయంలో కాంగ్రెస్ సైతం సర్వే నిర్వహించింది. బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతున్నదని, కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని భావిస్తున్నది. రెండు పార్టీలూ పోటాపోటీగా సర్వే అంచనాలపై ఆధారపడుతున్నాయి.
ఇజ్జత్ కా సవాల్ :
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు.. పార్టీల భవిష్యత్తుపై ప్రభావం చూపనున్నది. సిట్టింగ్ స్థానాన్ని గెలిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం తమదేనని చెప్పుకోడానికి బీఆర్ఎస్ తన వంతు ప్రయత్నాలు చేస్తుంది. ఓడిపోతే పరువు పోతుందని, ఇక గ్రాఫ్ పెరిగే అవకాశమే ఉండదనేది ఆ పార్టీ ఆందోళన. పదేండ్ల పాలనను చూసి ప్రజలు బీఆర్ఎస్ ను ఇంటికి సాగనంపారని, ఇప్పుడు ఉప ఎన్నికల్లోనూ ఆ పార్టీకి చేదు అనుభవం తప్పదని, కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని తాజా సర్వే అంచనాలతో అధికార పార్టీ కొండంత విశ్వాసంతో ఉన్నది. బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించడం కాంగ్రెస్ తక్షణ కర్తవ్యంగా మారింది. ఇందుకోసం అవసరమైన కార్యాచరణను సైతం కాంగ్రెస్ రూపొందించుకున్నది.
డివిజిన్లవారీగా వర్క్ డివిజన్ :
కాంగ్రెస్ తరఫున పోటీచేసే అభ్యర్థిపై ఇంకా స్పష్టత రానప్పటికీ గెలుపు కోసం నిర్దిష్టమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. జీహెచ్ఎంసీ డివిజన్లను ప్రామాణికంగా తీసుకుని ఒక్కొక్కరికి బాధ్యతలు అప్పజెప్పింది. జిల్లా ఇన్ చార్జి మంత్రి సైతం ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సామాజికవర్గాలకు అనుగుణంగా మంత్రులకు, సీనియర్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు అప్పజెప్పారు. యాదవ సామాజికవర్గం ఎక్కువగా ఉండడంతో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్ యాదవ్ తదితరులను రంగంలోకి దించారు. కమ్మ సామాజికవర్గం కూడా ఉండడంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పీసీసీ నాయకుడు జెట్టి కుసుమ కుమార్ కు బాధ్యతలు అప్పజెప్పారు. ముస్లిం సామాజికవర్గానికి గణనీయమైన ఓటు బ్యాంకు ఉండడంతో మజ్లిస్ సైతం కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది.
కేటీఆర్ కు సవాల్ :
రెండేండ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన 39 స్థానాల్లో దాదాపు సగం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. పట్టణ ప్రాంతాలపై కేటీఆర్ ఫోకస్ పెట్టినందువల్లనే మెజారిటీ స్థానాలు గెలవగలిగామని ఆ పార్టీ నేతలు గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు జూబ్లీ సిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు కేటీఆర్ కు సవాలుగా మారింది. గత ఎన్నికల్లో కేటీఆర్ ప్రభావం అని గొప్పగా చెప్పుకోవడంతో ఈసారి కూడా ఆ ఫార్ములా వర్కవుట్ కావడం అనివార్యంగా మారింది. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఫామ్ హౌజ్ కే పరిమితం కావడంతో వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను సైతం ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరే పార్టీ కంటే ముందుగానే ఆయన సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారు. సర్వేల్లో గెలుపు బీఆర్ఎస్ కే నంటూ వచ్చిన వివరాలను గర్వంగా ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం కేటీఆర్ చరిష్మాను నిర్ణయించనున్నది.

