కలం డెస్క్ : గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఈసారి మూసీ నదికి వరదలు రావడం ఇటు ప్రజలకు, అటు ప్రభుత్వానికీ ఆందోళన కలిగించింది. కానీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అలార్మింగ్ స్థాయిలో లేకపోవడం ప్రభుత్వానికి ఒకింత ఉపశమనం. మూసీని ఆనుకుని ఉన్న పలు బస్తీల్లోని ప్రజలను కొన్ని నెలల క్రితమే ఖాళీ చేయించి పునరావాసం కల్పించడం ఆశించిన ఫలితాలను ఇచ్చిందన్నది ప్రభుత్వ భావన. ఈ ఇండ్లను ‘హైడ్రా’ (HYDRAA) ఖాళీ చేయిస్తున్నప్పుడు ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ఈ రెండు పార్టీల నేతలు హడావిడి చేసి ప్రభుత్వాన్ని విమర్శించాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ‘రాత్రి నిద్ర’ పేరుతో ప్రత్యేక క్యాంపెయిన్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు వరదలతో అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ సైలెంట్ అయిపోయాయి.
‘హైడ్రా’పై తగ్గిన విమర్శలు :
నాలాలు, మూసీ నదిని కబ్జాచేసి కట్టుకున్న ఇండ్లను ఖాళీ చేయించే ఉద్దేశంతో రెడ్ మార్కు, బ్లూ మార్క్ (బఫర్ జోన్ లో) వేసి నోటీసులు జారీచేయడంపై విపక్షాలు అప్పట్లో తప్పుపట్టాయి. దశాబ్దాలుగా నివసిస్తున్న వారిని హఠాత్తుగా ఖాళీ చేయించడం సమంజసం కాదంటూ ప్రభుత్వాన్ని నిందించాయి. కానీ తాజాగా వచ్చిన వరదలతో విపక్షాల తీరులో మార్పు వచ్చింది. ఇండ్లను ఖాళీ చేయించకుండా అక్కడే ఉంచినట్లయితే భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగి ఉండేదన్న అభిప్రాయాలపై విపక్షాలు నోరెత్తడంలేదు. ‘రాత్రి నిద్ర’ చేసిన కిషన్ రెడ్డి సైతం మౌనంగానే ఉన్నారు. కబ్జాలపై హైడ్రా ఉక్కుపాదం మోపినప్పుడు విమర్శించిన నేతలు ఇప్పుడు కిక్కురుమనకుండా ఉన్నారు. హైడ్రా తీరును ప్రజలు సైతం ఇప్పుడు స్వాగతిస్తున్నారు.
ప్రజల్లో రియలైజేషన్ :
మూసీ నదిని కబ్జా చేయడం ద్వారా జరిగే నష్టాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే హెచ్చరించారు. మూసీని ప్రక్షాళన చేయకపోతే అక్కడ నివాసం ఉంటున్న ప్రజలకు మాత్రమే కాక నగరానికే పెను ప్రమాదం తప్పదని హెచ్చరించారు. పేద కుటుంబాలను ఖాళీ చేయించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇవ్వడంతో పాటు వారి పిల్లలకు విద్యావకాశాలను కల్పించారు. మహిళలకు స్వయం ఉపాధి లభించేలా కుట్టుమిషన్లను పంపిణీ చేసింది. ఆ కుటుంబాలన్నీ తాజా వరదలతో ఆ ప్రాంతాన్ని ముంచేయడం చూసిన తర్వాత ఖాళీ చేయడమే మంచిదైంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హైడ్రాను ఆనాడు తప్పుపట్టిన ప్రజలు, రాజకీయ నేతలు ఇప్పుడు రియలైజ్ కావడం గమనార్హం.
మూసీ పునరుజ్జీవనానికి లైన్ క్లియర్ :
రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన మూసీ పునరుజ్జీవ పథకం ఆలోచనకు తాజా వరదలతో బలం చేకూరినట్లయింది. మూసీ నదితో పాటు నాలాల కబ్జాలను తొలగించడం ద్వారా భవిష్యత్తు ముంపు ముప్పు తొలగిపోతుందనే అభిప్రాయం అన్ని సెక్షన్లలో వ్యక్తమవుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనను ఇప్పటికీ వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజా వరదల విషయంలో ఘాటు స్థాయిలో విమర్శలు చేయకపోవడాన్ని ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. మూసీ ప్రక్షాళన, పునరుజ్జీవనంతో ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చనే రియలైజేషన్ వచ్చిందనే మాటలు వినిపిస్తున్నాయి.

