epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఆ దేశంలో వాట్సాప్‌పై నిషేధం

రష్యా(Russia) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రపంచంలో అత్యధికంగా వాడే మెసేజింగ్ యాప్‌లలో ఒకటైన వాట్సప్‌(WhatsApp)పై సంపూర్ణ నిషేధం విధించే దిశగా చర్యలు ప్రారంభించింది. తమ దేశ చట్టాలకు అనుగుణంగా వాట్సప్ కార్యకలాపాలు నిర్వహించడం లేదని, ముఖ్యంగా నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాలు, ఆన్‌లైన్ మోసాలను అరికట్టే ప్రక్రియలో సహకరించడం లేదని రష్యా ఆరోపిస్తోంది.

మెసేజింగ్ యాప్‌లు దేశ భద్రతా సంస్థలకు అవసరమైన సమాచారం అందించాల్సిన అవసరం ఉందని రష్యా(Russia) కొంతకాలంగా చెబుతోంది. ఈ నేపథ్యంలో వాట్సప్‌తో పాటు టెలిగ్రామ్, ఇతర సందేశ యాప్‌లు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను సడలించి దర్యాప్తులకు అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వానికి అందించాల్సి రావాలని మాస్కో పట్టుబడుతోంది.

అయితే ఈ మేరకు రష్యా చేసిన అభ్యర్థనలను వాట్సప్, మెటా తిరస్కరించాయి. యూజర్ల వ్యక్తిగత చాట్స్, కాల్స్, డేటా రక్షణ తమ మొదటి లక్ష్యమని, ప్రభుత్వానికి యాక్సెస్ ఇవ్వడం వలన యూజర్ల ప్రైవసీకి భంగం కలుగుతుందని మెటా స్పష్టంచేసింది. గత ఆగస్టులో రష్యా ప్రభుత్వం వాట్సప్‌లో వాయిస్, వీడియో కాలింగ్ సౌకర్యాలకు నిషేధం విధించింది. ఈ చర్యను రష్యా జాతీయ భద్రత చర్యగా పేర్కొంది. కాల్స్ సౌకర్యం నిలిపివేయడంతో యూజర్లు మెసేజింగ్ మాత్రమే ఉపయోగించే పరిస్థితి ఏర్పడింది.

అదే సమయంలో రష్యా తన స్వదేశీ మెసేజింగ్ యాప్ అయిన ‘మాక్స్’ ఉపయోగించాలని ప్రజలకు సూచించింది. ఈ యాప్‌లో ప్రభుత్వానికి అవసరమైనప్పుడు డేటాను యాక్సెస్ చేసే వీలుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ యాప్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ లేకపోవడం వల్ల ప్రజల వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మెటా ప్రతినిధులు స్పందిస్తూ, రష్యా ప్రభుత్వం ప్రజల ప్రైవసీ, కమ్యూనికేషన్ స్వేచ్ఛను హరించే నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. యూజర్ల డేటాను రక్షించడమే తమ ఉద్దేశం అని, ప్రభుత్వానికి యాక్సెస్ ఇవ్వడం ప్రజల హక్కులను ఉల్లంఘించడం అవుతుందని పేర్కొన్నారు. తమ ఈ నిర్ణయం కారణంగానే వాట్సప్‌పై నిషేధం విధించేందుకు ప్రయత్నిస్తున్నారని మెటా ఆరోపించింది.

కొంతమంది విశ్లేషకులు ఈ చర్యలను కేవలం భద్రత కారణంగా కాకుండా రాజకీయ ఉద్దేశాలతో కూడినవిగా చూస్తున్నారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా మాట్లాడే రష్యన్ పౌరులను పర్యవేక్షించేందుకు, వారి కమ్యూనికేషన్‌ను నియంత్రించేందుకు పుతిన్ ప్రభుత్వం ఈ చర్యలను ఉపయోగిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

రష్యాలో ఎక్కువగా ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లు టెలిగ్రామ్, వాట్సప్. వ్యక్తిగతం నుంచి వ్యాపారపరమైన కమ్యూనికేషన్ వరకు ప్రజలు పెద్దఎత్తున ఈ రెండు యాప్‌లపై ఆధారపడుతున్నారు. వాట్సప్‌పై సంపూర్ణ నిషేధం విధిస్తే దేశవ్యాప్తంగా కమ్యూనికేషన్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ నిర్ణయం విషయంలో ముందుకెళ్తుందా? లేదంటే పునరాలోచనలో పడుతుందా? అన్నది వేచి చూడాలి.

Read Also: ‘అవతార్-3’ కోసం 12 లక్షల మంది రెడీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>