epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

తెలంగాణలో కనిపించని బీజేపీ ‘నారీశక్తి’

ఇటీవల బిహార్ ఎన్నికల్లో బీజేపీ(BJP) కూటమి అఖండ విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో తమ గెలుపునకు మహిళలే కారణమని ఎన్డీఏ నేతలు ముఖ్యంగా బీజేపీ నాయకులు ఢంకా బజాయించి చెప్పారు. మరికొందరు కాషాయ పార్టీ నేతలు ఇంకాస్త డోసు పెంచి దేశవ్యాప్తంగా తమ అప్రతిహత విజయాలకు మహిళలే కారణమని చెబుతున్నారు. అలాంటి ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి మహిళా అభ్యర్థులే దొరకడం లేదంటే నమ్మగలరా? ఈ విచిత్రకరమైన పరిస్థితి ఆ పార్టీకి తెలంగాణలో ఎదురైంది. ఇటీవల తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. రాబోయే శాసనసభ ఎన్నికల్లో అధికారం సాధించి, తెలంగాణను కైవసం చేసుకోవాలని చూస్తున్న బీజేపీ ఈ పంచాయతీ ఎన్నికలను అందుకు సన్నాహకంగా ఉపయోగించుకోవాలని భావించింది.

అయితే, తీరా రంగంలోకి దిగాలనుకునే సమయానికి అసలు విషయం తెలిసి ఆ పార్టీ నాయకులు కంగుతిన్నారు. కారణం.. స్థానిక ఎన్నికల్లో మహిళలకు 50శాతం వాటా ఉండగా, బీజేపీ తరఫున పోటీ చేయడానికి అసలు మహిళా అభ్యర్థులే లేరంట. దీంతో ఏం చేయాలో తెలియక, ఇప్పటికిప్పుడు పార్టీలోకి ఎవరైనినా చేర్చుకొని పోటీ చేయాలని భావిస్తోందట కమలం పార్టీ.

ఆ సభ్యత్వం లెక్కలు ఉత్తివేనా?..:

గత ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ(BJP) మేనిఫెస్టో నాలుగు కీలకాంశాల ఆధారంగా రూపొందించారు. అవి.. యువత, పేదలు, రైతులు, మహిళలు. వీటిని మేనిఫెస్టోకు నాలుగు స్తంభాలుగా బీజేపీ నాయకులు చెప్పారు. అంతేకాదు, మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సైతం ‘నారీశక్తి(Nari Shakti)’కి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. విద్య, వ్యాపార, ఆర్థిక సహాయ పథకాలతోపాటు మహిళలకు పార్లమెంట్, అసెంబ్లీలో 33శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ‘నారీశక్తి వందన్ అధినియం’ బిల్లును ప్రవేశపెట్టింది. కానీ, ఇవేవీ తెలంగాణలో ఆ పార్టీకి ఉపయోగపడలేదని తాజాగా స్థానిక సంస్థల సందర్భంగా బయటపడింది. విచిత్రమేంటంటే గత శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది స్థానాలు దక్కాయి. లోక్ సభ ఎన్నికల్లో ఎనిమిది మంది ఎంపీలుగా గెలిచారు.

అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తెలంగాణలో బీజేపీ సభ్యత్వం గురించి. ఇక్కడ ఆ పార్టీకి ఏకంగా 40లక్షల మంది సభ్యత్వం ఉంది. ఇది స్వయంగా ఆ పార్టీ నేతలే చెప్తున్న విషయం. అయితే, ప్రస్తుతం స్థానిక ఎన్నికల్లో(Panchayat Elections) ఆ పార్టీకి మహిళా అభ్యర్థులే దొరకడం లేదంటే సభ్యత్వం లెక్కలన్నీ ఉత్తివేనా అనే అనుమానం కలగకమానదు. అంతేకాదు, ఈ లెక్కన చూస్తే తెలంగాణలో తాము బలపడినట్లు, రాబోయే ఎన్నికల్లో తాము అధికారంలోకి రాబోతున్నట్లు బీజేపీ చెప్తున్నవన్నీ ఇంతేనా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Read Also: ఎమ్మెల్యేలపై స్థానిక భారం వేసిన కేటీఆర్

Follow Us On : Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>