epaper
Friday, January 16, 2026
spot_img
epaper

కేసీఆర్ ఇంటికి కవిత సర్‌ప్రైజ్ విజిట్ !

కలం డెస్క్ : బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) తల్లిదండ్రులతోనూ అంటీ ముట్టనట్లుగానే ఉన్నారు. సోదరుడు కేటీఆర్‌తోనూ మాటా మంతీ లేదు. అలాంటిది ఇప్పుడు సడన్‌గా కేసీఆర్ నివాసానికి ఎందుకెళ్ళారు? అదేనండీ… కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార నివాసంగా ఉన్న ప్రగతి భవన్‌కు వెళ్ళారు. ఇప్పుడు అది ప్రగతి భవన్ కాదనుకోండి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అది జ్యోతిరావ్ ఫూలే ప్రజా భవన్‌గా మారిపోయింది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆ భవనాన్ని అధికార నివాసంగా మార్చుకున్నారు. ఒకప్పుడు తల్లితండ్రులతో రోజుల తరబడి ఆ భవనంలో కలియదిరిగిన కవిత సరిగ్గా మూడేండ్ల తర్వాత మళ్ళీ అడుగు పెట్టారు. కానీ ఆ భవనానికి, కేసీఆర్ కుటుంబానికి ఇప్పుడు ఎలాంటి సంబంధమూ లేదు.

సరికొత్త చర్చకు దారితీసిన సందర్శన :

ప్రజా భవన్‌లోకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) అడుగు పెట్టడం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్ సీఎంగా ఉన్న టైమ్‌లో ప్రగతి భవన్‌గా పిల్చుకునే ఈ భవనం కేవలం ఆయనకు, ఆయన కుటుంబానికి అధికార నివాసం మాత్రమే కాదు. రాష్ట్ర రాజకీయాలకే కేంద్ర బిందువు. సచివాలయానికి వెళ్ళకపోవడంతో ప్రగతి భవన్‌నే కేసీఆర్ పరిపాలనా కేంద్రంగా మార్చుకున్నారు. మొత్తం కుటుంబమే ఆ భవనంలో నివసించేది. ఆ తర్వాత కొడుకు కేటీఆర్, కుమార్తె కవిత వేర్వేరు ఇండ్లలోకి వెళ్ళిపోయారు. అధికారం పోయేంతవరకూ కేసీఆర్ ఆ భవనంలోనే ఉన్నారు. భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కుమారుడి ఎంగేజ్‌మెంట్ కార్యక్రమానికి కవిత తన భర్తతో కలిసి వెళ్ళారు. కాబోయే వధూవరులిద్దరూ కవిత దంపతుల కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. డిప్యూటీ సీఎం సైతం కవిత దంపతులను సాదరంగా ఆహ్వానించారు.

కవిత కట్టిన చీర స్పెషల్ ఎట్రాక్షన్ :

కాబోయే వధూవరులను ఆశీర్వదించడానికి వెళ్ళిన కవిత ఆ సమయంలో కట్టుకున్న చీర కాంగ్రెస్ పార్టీ వాడుకునే మూడు రంగులతో పోలి ఉండడం సరికొత్త రాజకీయ చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన కవిత ఇటు తల్లిదండ్రులతో, ఇటు సోదరుడితో అంటీముట్టనట్టుగానే ఉన్నారు. పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా తన విధుల్లో ఫెయిల్ అయిందని ఆరోపించారు. సమీప బంధువైన హరీశ్‌రావుపై నిప్పులు చెరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రంగులను పోలి ఉండే చీరను ధరించి డిప్యూటీ సీఎం అధికారిక బంగళాగా ఉండే ప్రజా భవన్‌లోకి అడుగు పెట్టడం రాజకీయ రంగు పులుముకున్నట్లయింది. కవిత రాజకీయ కదలికల వెనక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నారనే ఆరోపణలతో పాటు కాంగ్రెస్‌కు మేలు చేకూర్చేలా ఆమె వైఖరి ఉన్నదనే విమర్శలూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆమె ఉద్దేశపూర్వకంగానే ఈ చీరను ధరించి వెళ్ళారనే చర్చ మొదలైంది.

మూడేండ్ల తర్వాత ఆ భవనంలోకి :

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో చివరిసారిగా ప్రజా భవన్‌ను కవిత 2022 డిసెంబరు 3న సందర్శించారు. ఆ కేసులో సీబీఐ నుంచి నోటీసులు అందుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణపై చర్చించేంధుకు కేసీఆర్‌తో ఈ భవనంలో ఆ రోజు సమావేశమయ్యారు. ఈ సమావేశం అప్పట్లో రాష్ట్రంలోనే హాట్ టాపిక్‌. దానికి ముందు 2022 సెప్టెంబరు 25న ఇదే భవనంలో బతుకమ్మ సంబురాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆనాడు రాజకీయ కేంద్రంగా ఉన్న ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజా భవన్‌గా మారిన తర్వాత మూడేండ్లకు కవిత అడుగు పెట్టడం సరికొత్త రాజకీయ చర్చకు దారితీసింది. ఆమె కట్టుకున్న చీర ఒక పొలిటికల్ మెసేజ్ ఇచ్చినట్లయిందన్న వాదనలూ వినిపించాయి. అప్పట్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలపై సీబీఐ, ఈడీ దర్యాప్తు జరుగుతున్న సమయంలో కవిత ప్రగతి భవన్ విజిట్ ఒక రకమైన చర్చనీయాంశమైతే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యి ఆ పార్టీపై నిప్పులు చెరుగుతూ సొంత ప్లాట్‌ఫామ్‌ను రూపొందించుకుంటున్న సమయంలో ప్రజా భవన్‌గా మారిన ఆ భవనంలోకి కాంగ్రెస్ రంగుల చీరతో ఎంట్రీ ఇవ్వడం రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది కీలకమైంది.

Read Also: హైడ్రా విచారణకు హాజరైన ఎమ్మెల్యే నవీన్ యాదవ్

Follow Us On : Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>