కలం, వెబ్ డెస్క్: సంగారెడ్డి (Sangareddy) జిల్లా కేంద్రంలో వెలుగుమట్ల తరహా ఘటన రిపీట్ కాబోతున్నదా? పేదలకు కేటాయించిన కోట్ల రూపాయల విలువైన భూములకు ఎసరు పెట్టేందుకు రంగం సిద్ధమైందా? కోట్లు కొల్లగొట్టడానికి అడ్డుగా ఉన్న పేదలకు అడ్డు తొలగించే ప్రయత్నం జరుగుతుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. సంగారెడ్డి జిల్లాలో ఓ భారీ భూఆక్రమణకు తెరలేచినట్టు కథనాలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే.. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి అనుకొని ఉన్న పోతిరెడ్డిపల్లి గ్రామంలో 2007లో ఇండ్లు లేని నిరుపేదల కోసం సర్వే నెంబర్ 153/4, 153 /5, 153/ 24లలో రెండెకరాలు కేటాయించారు. పేదలైన 80 మందికి ఒక్కొక్కరిటీ 80 గజాల చొప్పున రెవెన్యూ అధికారులు పట్టాలు కూడా ఇచ్చారు. స్ధలం కేటాయించినప్పటికీ రోడ్లు, కరెంటు, నీరు, డ్రైనేజీ వంటి కనీస వసతలు లేకపోవడంతో పేదలు ఇక్కడ ఇండ్లు కట్టుకోలేకపోయారు. దీనికి తోడు ఈ స్థలాల్లోకి వెళ్లేందుకు దారి కూడా లేదు.
రోడ్డు మంజూరు కావడంతో పేదలకు ఆశలు
ప్రస్తుతం ఈ భూములకు దగ్గరగా సంగారెడ్డి (Sangareddy) నుండి కలివేముల వరకు 60 ఫీట్ల రోడ్డుతో 5.5 కిలోమీటర్ల వరకు రోడ్డు మంజూరైంది. ఇందుకు సంబంధించిన పనులు నడుస్తున్నాయి. దీంతో ఇక్కడ ఇండ్లు నిర్మించుకొవడానికి పట్టాలు పొందిన పేదలు సిద్ధమైయ్యారు. అంబేద్కర్ కాలనీగా నామకరణం చేసుకొని తాత్కలిక నిర్మాణాలు, గుడిసెలు వేసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇంతలోపే టీజేఅర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అనే రియల్ ఎస్టేట్ సంస్ధ ఎంట్రీ ఇచ్చింది. ఈ భూమి తమదేనంటూ నిర్మాణాలు చేపడుతోంది. దీంతో పేదలు లబోదిబోమంటున్నారు.
50 కోట్ల విలువైన భూమి కబ్జాకు యత్నం
టీజేఆర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ వారం నుంచి ఈ స్థలంలో ప్లాట్లను చదును చేస్తోంది. టీజేఆర్ సిబ్బంది హద్దురాళ్లను తొలగిస్తున్నారు. దీంతో ఇన్నిరోజులు కాపాడుకున్న తమ ప్లాట్లను టీజెఅర్ (తాటికొండ జానకీ రామ్ ఇన్ ఫ్రా స్టక్చర్) సంస్ధ తమ హద్దులను తొలగించి కబ్జా చేసే కుట్ర చేస్తున్నరని పేదల లబోదిబోమంటున్నారు. కంపెనీకి సంబంధించిన సూపర్వైజర్లు గూడిసెలను, జెండా దిమ్మెలను, హద్దులను కూల్చేసి దౌర్జన్యం చేస్తున్నారని పేదలు ఆరోపిస్తున్నారు. తమను ప్లాట్లలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నరని చెబుతున్నారు. ప్రసుత్తం గజానికి 40 వేల పలుకుతున్న సుమారు 50 కోట్ల విలువైన భూమిని కబ్జా చేయాలనే ప్రయత్నం జరుగుతున్నట్టు అరోపిస్తున్నారు.
పేదల అందోళన…
సదరు కంపెనీకి వ్యతిరేకంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం దగ్గర, స్థలం వద్ద బాధితులు అందోళన నిర్వహించారు. భూమి సర్వే కోసం రెవెన్యూ ఇన్ స్టెక్టర్ వస్తే లా అండ్ అర్డర్ సమస్య ఉందని పోలీసులు అడ్డుకుంటున్నారని చెబుతున్నారు. తమ ప్లాట్లను కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 2007లో జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే రెవెన్యూ అధికారులు తమకు పట్టాలు ఇచ్చారని బాధితులు చెబుతున్నారు. జగ్గారెడ్డి ముందుకొచ్చి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
రెవెన్యూ అధికారులు ఏమంటున్నారు?
ఈ ఘటనపై రెవెన్యూ అధికారులను సంప్రదించగా.. పేదలకు పట్టాలు ఇచ్చిన మాట వాస్తమేనని.. కానీ వారు నిర్ణీత గడుపులోపు ఇండ్లు నిర్మించుకోలేదని చెబుతున్నారు. అంతేకాకుండా ఎవరైతే ఈ భూమిని ప్రభుత్వానికి ఇచ్చారో ఆ యజమాని కోర్టును ఆశ్రయించారని చెబుతున్నారు. యజమాని కోర్టులో కేసు వేశారని, భూమి తిరిగి అప్పగించడానికి నిరాకరిస్తున్నాడని చెబుతున్నారు. కోర్టులో కేసు ఉండటంతో ఈ భూముల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోతున్నమని చెబుతున్నారు. టీజెఅర్ ఇన్ ఫ్రా కబ్జా ప్రయత్నం గురించి ప్రశ్నిస్తే సమాధానం దాటవేస్తున్నారు. అయితే సంగారెడ్డి పట్టణానికి అనుకొని ముంబాయి జాతీయ రహదారికి అనుకొని ఉన్న పొతిరెడ్డిపల్లి , కంది పరిసరాల ప్రాంతాల్లోని వందల కోట్ల విలువైన వివిధ రకాల ప్రభుత్వ భూములకు గత ప్రభుత్వ హయాంలో బడా నేతలందరు ఒకే తాటిపైకి వచ్చి అందరికి లబ్ధి జరిగేలా ఇష్టారీతిన ఎన్వోసీ మంజూరు చేసుకున్నారనే అరోపణలు ఉన్నాయి. ఈఎన్వోసీలను పొందిన బడా బాబుల భూములకు రోడ్డు కోసమే, కేవలం వారి రియల్ ఎస్టేట్ పెంచుకోవడం కోసమే .. సంగారెడ్డి (Sangareddy) నుండి కలివేముల గ్రామం వరకు మధ్యలో ఏ ఊరులేకపోయిన 60 ఫీట్ల రొడ్డును కుడా వేస్తున్నరనే విమర్శలు విన్పిస్తున్నాయి. అన్ని రాజకీయపార్టీల బడా నేతల అండా చూసుకొనే పేదలకు కేటాయించిన భూములను సైతం కబ్జా చేయడానికి రియల్ ఎస్టేట్ మాఫియా తెగించిందన్న ప్రచారం సాగుతోంది.
Read Also: ఖమ్మంలో కాంగ్రెస్ రాక్షస క్రీడ.. వెలుగుమట్ల కూల్చివేతలపై ఈటల ఫైర్
Follow Us On: Instagram

