కలం/ఖమ్మం బ్యూరో: డీఫాల్ట్ మిల్లర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. ఖమ్మం (Khammam) జిల్లాలోని డీఫాల్ట్ మిల్లర్లపై జిల్లా యంత్రాంగం కేసులు నమోదు చేసింది. ప్రభుత్వానికి సంబంధించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చే క్రమంలో కొందరు మిల్లర్లు నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు కూడా చెల్లించడం లేదు. దీంతో కేసులు నమోదు చేశామని అధికారులు చెబుతున్నారు.
ఖమ్మం (Khammam) రూరల్ మండలం మంగలగూడెం గ్రామంలోని శ్రీ సత్యనారాయణ సిల్కీ సార్టెక్స్ రైస్ మిల్ యాజమాన్యం 2021–22 ఖరీఫ్, 2022–23 ఖరీఫ్, రబీ, 2023–24 ఖరీఫ్ సీజన్లలో ప్రభుత్వానికి బియ్యం అందజేయడంలో విఫలమై 9.49 కోట్ల రూపాయలు అసలు, పెనాల్టీలతో కలిపి 13.84 కోట్ల వరకు డిఫాల్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మిల్లు యజమానులు కన్నేటి జ్యోతి, మామిడాల మానసపై ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
అలాగే నేలకొండపల్లి మండలం రాయిగూడెం గ్రామంలోని వెంకటేశ్వర రైస్ మిల్ 2022–23 ఖరీఫ్, రబీ సీజన్లలో 7.59 కోట్ల అసలు, పెనాల్టీలతో కలిపి 10.88 కోట్ల వరకు డిఫాల్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మిల్లు యజమాని మేకల రామారావుపై నేలకొండపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ ధాన్యం, నిధుల పరిరక్షణలో రాజీ పడబోమని, డిఫాల్ట్ చేసే మిల్లర్ల పై చట్టపరమైన కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు. బకాయిల వసూలు చర్యలు వేగవంతం చేయడంతో పాటు సంబంధిత శాఖల ద్వారా తదుపరి విచారణ కొనసాగుతున్నదని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పదవీ కాలం పొడిగింపు
Follow Us On : WhatsApp

