కలం/ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) నగరశివారులో భారీ ఆపరేషన్ వెలగుమట్ల వినోబానగర్ భూదాన్ భూముల్లో రెవెన్యూ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక్కడ ఉన్న నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు. భూదాన్ భూముల్లో అక్రమ నిర్మాణాలు ఉండటం వల్లే తాము కూల్చివేతలు చేపట్టామని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ కూల్చివేతలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. నిరుపేదల వేసుకున్న గుడిసెలు కూల్చేయడం న్యాయమేనా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నారు. ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు, కొన్ని సంస్థలకు వందల ఎకరాలు కట్టబెడుతోందని .. కానీ పేద ప్రజల మీద కనికరం లేదా? అంటూ ప్రశ్నించారు. సోమవారం రాత్రి ఖమ్మం నగరంలోని ధ్వంసలాపురంలో టీటీడీకి 20 ఎకరాల భూమి కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. 24 గంటలు గడవక ముందే అదే ఖమ్మం నగరంలో ప్రభుత్వం అభాగ్యుల ఇళ్లను కూల్చివేస్తూ దారుణానికి ఒడి గట్టింది. ఇప్పుడు ఇదే అంశం పై జిల్లాలో పెద్ద చర్చ నడుస్తోంది.
జిల్లా మంత్రులు ఆదుకుంటారా?
ఖమ్మం (Khammam) జిల్లాలోని ఓ సీనియర్ మంత్రి సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి, ఖమ్మం జిల్లాలో భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని, తిరుమల దర్శనానికి వెళ్లలేని భక్తులకు స్థానికంగా టీటీడీ దేవాలయం ఏర్పడితే ఆధ్యాత్మిక అవసరాలు నెరవేరుతాయని వివరించడం, ఒప్పించడం, భూమి కేటాయించడం అన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి. మరో పక్క దశాబ్దకాలంగా వందల కుటుంబాలు ఎప్పుడు ఏ ఆపద ముంచుకొస్తుందోనన్న భయంతో కంటి మీద కునుకు లేకుండా,సమస్య పరిష్కారం కోసం వేచి చూస్తున్న పరిస్థితి. సమస్య పరిష్కారం కాకపోగా గూడు పోగొట్టుకొని ఎంతో మంది అభాగ్యులు నిస్సహాయ స్థితిలో దీనంగా చూస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వెలుగుమెట్ల నిర్వాసితులు కోరుతున్నారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఒక పరిష్కార మార్గం చూపుతారని, బాధితులతో పాటు జిల్లా ప్రజలు కూడా ఆశాగా ఎదురు చూస్తున్నారు.

