epaper
Sunday, March 1, 2026
epaper

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ టార్గెట్ ఫెయిల్.. రూ.95 కోట్లు వృధా!!

కలం, నల్లగొండ బ్యూరో : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.95 కోట్ల వ్యయంతో నల్లగొండ జిల్లా కేంద్రంలో ఐటీ టవర్‌ (Nalgonda IT Tower)ను గత బీఆర్ఎస్ సర్కారు నిర్మించింది. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించడం ద్వారా స్థానిక యువతకు హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా సొంత జిల్లాలోనే ఉద్యోగాలు కల్పించాలనే టార్గెట్ తో తెలంగాణలోని నల్లగొండ, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, సూర్యాపేటలో టవర్లను నిర్మించింది. ఒక్కో ఐటీ టవర్‌లో 15 నుంచి 20 వరకు కార్పొరేట్ కంపెనీలను రప్పించి ఒక్కో ఐటీ టవర్‌లో 25వేల మందికి పైగా ఐటీ ప్రొఫెషనల్స్‌కు ఉపాధి కల్పించాలని భావించింది.

ఈ క్రమంలోనే అప్పట్లో జాబ్ మేళా, ఇంటర్వ్యూలంటూ నల్లగొండలో బీఆర్ఎస్ నేతలు హడావిడి చేశారు. కానీ పట్టుమని పది కంపెనీలైనా ఐటీ టవర్‌లో అడుగు పెట్టింది లేదు. అన్ని షిప్టులు కలిపినా.. 200 మందికి మించి ఐటీ ఉద్యోగులు లేకపోవడం గమనార్హం. ఈ 200 మందిలోనూ తక్కువ వేతనం ఇచ్చే డేటా ప్రాసెసింగ్ వంటి ఉద్యోగాలే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇంతవరకు బాగానే ఉంది. కానీ గత రెండున్నరేండ్లుగా నల్లగొండతో పాటు సూర్యాపేటలోని ఐటీ టవర్ సైతం ఉత్సవ విగ్రహంలా మారిపోయింది. కనీసం కాంగ్రెస్ సర్కారులోనైనా అందుకు మోక్షం కలుగుతుందేమోనంటే అదీలేదు.

గాలికొదిలేసిన కాంగ్రెస్ సర్కార్..

ప్రభుత్వాలు ఐటీ టవర్లు నిర్మించినా.. ప్రగతి భవన్లు కట్టినా.. మరో నిర్మాణం చేసినా.. అది పూర్తిగా ప్రజాధనమే. అయితే పాలకులు మాత్రం ప్రజాధనం అనే సంగతి మర్చిపోయారో.. లేక మా జేబుల్లోంచి పెట్టేది కాదు కదా.. అనుకుంటున్నారో.. తెలియదు గానీ, గత ప్రభుత్వాలు నిర్మించిన కట్టడాలను పక్కన పెట్టేస్తున్నారు. కొత్తగా భవనాలు నిర్మించి అందులో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దీనికి కారణం ఏమైనప్పటికీ వృథా అవుతోంది మాత్రం ప్రజాధనమే. కోట్ల రూపాయలు కుమ్మరించి ఐటీ టవర్‌ను పడావు పెట్టే బదులు.. వాటిని ప్రభుత్వ కార్యాలయాల అవసరం కోసమో.. లేక మరేదైనా ప్రజలకు ఉపయోగపడే అవసరాల కోసం వినియోగిస్తే బాగుంటుందనే అభిప్రాయం లేకపోలేదు. ఇప్పటికే నల్లగొండ జిల్లాలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలు కోకొల్లలు. ఇటీవల దాదాపు రూ.100 కోట్లతో న్యాక్, ఏటీసీ సెంటర్ల భవనాలను కొత్తగా నిర్మించి ప్రారంభించారు. ఈ కొత్త భవనాలను నిర్మించే బదులు ఐటీ టవర్‌ను దానికి కేటాయించినా ఎంతో ప్రయోజనకరంగా ఉండేది.

సూర్యాపేటలో మరీ దారుణం..

గత సర్కారు హయాంలో సూర్యాపేటకు నిధుల వరద పారింది. దీంతో అభివృద్ధి పనుల పేరుతో విధ్వంసమే జరిగిందని చెప్పాలి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్మించిన ఐటీ టవర్ (Suryapet IT Tower) పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. పాత కలెక్టరేట్ అద్దె భవనంలో ఐటీ టవర్ ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఆ భవనంలో ఐటీకి అవసరమైన సదుపాయాలు లేవనే చెప్పాలి. జాబ్ మేళా నిర్వహించి 600 ఐటీ ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఒక్క ఐటీ కంపెనీ కూడా అక్కడ కార్యకలాపాలు నిర్వహించడం లేదు. స్థానికంగా ఐటీ రంగంలో ఉద్యోగాలు పొందాలనే నైపుణ్యం గల యువత కల నెరవేరలేదు. ఇదిలావుంటే.. ఐటీ టవర్ల నిర్వహణకు టీఎస్‌ఐఐసి ప్రతినెలా రూ.లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. కానీ ఆ సంస్థకు మాత్రం కొన్ని కంపెనీల నుంచి నామమాత్రపు అద్దె వస్తుండడం గమనార్హం.

కంపెనీలను రప్పిస్తేనే యూజ్..

నల్లగొండలోని ఐటీ టవర్ భవనం చూడటానికి అత్యాధునికంగా, కార్పొరేట్ స్థాయిలో ఉంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రారంభంలో ఆసక్తి చూపిన పెద్ద కంపెనీలు ఇప్పుడు అక్కడ కార్యకలాపాలు సాగించడం లేదు. కేవలం కొన్ని చిన్న స్టార్టప్‌లు లేదా శిక్షణ కేంద్రాలకే ఇది పరిమితమైంది. దీంతో వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని ఆశించిన నల్లగొండ నిరుద్యోగులకు నిరాశే ఎదురైంది. దీనికితోడు నల్లగొండ హైదరాబాద్‌కు దగ్గరగా ఉండటం వల్ల, కంపెనీలు అక్కడే కార్యాలయాలు ఉంచేందుకు మొగ్గు చూపుతున్నాయి. మరోవైపు సర్కారు మారడంతో ఐటీ టవర్లపై నీలినీడలు కమ్ముకున్నాయనే మాట వాస్తవం. రూ. 95 కోట్ల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన ఈ ఐటీ హబ్.. కేవలం ఒక ఉత్సవ విగ్రహాంలా మారిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ప్రభుత్వం కొత్త ఐటీ పాలసీ ద్వారా కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇచ్చి, ఇక్కడ కార్యకలాపాలు మొదలయ్యేలా చూస్తేనే నల్లగొండ యువతకు న్యాయం జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!