epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సర్పంచ్ ఎన్నికలపై సీఎం రేవంత్ అప్‌డేట్

మరో 3–4 రోజుల్లో సర్పంచ్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. ప్రజలు అభివృద్ధి చేసే నాయకులనే గెలిపించాలని సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు.వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌(Kodangal) పర్యటన సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం రేవంత్‌ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పర్యటనలో భాగంగా కొడంగల్ నియోజకవర్గంలో అక్షయపాత్ర ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న కిచెన్‌ను పరిశీలించిన ఆయన, మిడ్‌డే మీల్స్‌ కిచెన్‌ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘‘కొడంగల్‌లో ఏ విద్యార్థి ఆకలితో ఉండకూడదన్న లక్ష్యంతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. ప్రస్తుతం 28 వేల మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందిస్తున్నాం. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో 5 వేల మంది విద్యార్థులు పెరిగారు’’ అని వివరించారు.

అభివృద్ధిపై ప్రభుత్వ దృక్పథం వివరించిన రేవంత్‌(Revanth Reddy)… ‘‘పిల్లల విద్యనే భవిష్యత్తును మారుస్తుంది. కొడంగల్‌లో రూ.5 వేల కోట్లతో అతిపెద్ద ఎడ్యుకేషన్‌ క్యాంపస్‌ను నిర్మిస్తున్నాం. రాష్ట్రంలో తొలి సైనిక్‌ స్కూల్‌ను కూడా ఇక్కడే ఏర్పాటు చేయబోతున్నాం. 16 నెలల్లో కొడంగల్‌ను అంతర్జాతీయ ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం’’ అని ప్రకటించారు.

రాష్ట్రంలో మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కూడా ఆయన ప్రస్తావించారు. “మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాం. వెయ్యి ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులుగా చేశాం. సోలార్‌ ప్లాంట్లు, పెట్రోల్‌ బంకుల యాజమాన్యం కూడా వారికి ఇస్తున్నాం. అదానీ, అంబానీలతో పోటీ పడే స్థాయికి వారిని తీసుకువెళ్లడం మా లక్ష్యం. మహిళా సంఘాల ఉత్పత్తులు అమెజాన్‌లో అమ్ముకునేలా సహాయం చేస్తున్నాం’’ అని వివరించారు.

కొడంగల్‌ మౌలిక వసతుల అభివృద్ధిపై కూడా సీఎం పలు హామీలు ఇచ్చారు. ‘‘మూడునెలల్లో కొడంగల్‌లోని ప్రతి గ్రామానికి కృష్ణా నీళ్లు అందిస్తాం. లగచర్ల పారిశ్రామిక వాడకు అంతర్జాతీయ గుర్తింపు తెస్తాం. కొడంగల్‌ను తెలంగాణ నోయిడాగా మార్చుతాం. రాబోయే నెలల్లో రైల్వే పనులు మొదలవుతాయి. సిమెంట్‌ పరిశ్రమ స్థాపనకు కూడా అడుగులు వేస్తున్నాం’’ అని తెలిపారు.

Read Also: ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద ఘోర ప్రమాదం

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>