కలం, వెబ్ డెస్క్: బిట్‌కాయిన్ స్కామ్ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపార వేత్త రాజ్ కుంద్రా(Raj Kundra)కు బెయిల్ వచ్చింది. ముంబైలోని మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కోర్టు శుక్రవారం ఆయనకు బెయిల్ ఇచ్చింది. క్రిప్టో కరెన్సీ రూ.150 కోట్ల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై నమోదైన కేసులో ఆయనకు బెయిల్ వచ్చింది.
ఏమిటీ బిట్‌కాయిన్ కేసు?
‘వేరియబుల్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థ 2017లో ‘గెయిన్ బిట్‌కాయిన్ పోంజీ స్కీమ్’ను నిర్వహించింది. బిట్కాయిన్లపై పెట్టుబడి పెడితే, నెలకు 10శాతం మేర లాభాలు వస్తాయని ఆశ చూపించింది. ఇందులో ప్రజలను చేర్చుకోవడానికి వీలుగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ పద్ధతిలో ఏజెంట్ల ద్వారా ముంబై, ఢిల్లీ నగరాల్లో పలువురి నుంచి డబ్బులు కట్టించుకుంది. ఇలా రూ.6వేల కోట్లకుపైగా ఆ సంస్థ వసూలు చేసింది.
అయితే, పెట్టిబడి పెట్టినవాళ్లకు ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోగా, అసలు సైతం వెనక్కి వచ్చే పరిస్థితి కనిపించలేదు. ఈ క్రమంలో ఢిల్లీ, ముంబైలో సంస్థపై కేసులు నమోదయ్యాయి. స్కీమ్ మోసం బయటపడడంతో ఈడీ రంగంలోకి దిగింది. సంస్థ, దాని యజమాని, ప్రమోటర్లపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది.
సింగపూర్ కేంద్రంగా ఉన్న వేరియబుల్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి రాజ్ కుంద్రా (Raj Kundra) యజమాని అని, ఈ స్కామ్‌లో ప్రధాన లబ్ధిదారుడు ఆయనే అని ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో ఆయనతోపాటు స్కామ్‌లో భాగమున్న అమిత్ భరద్వాజ్, వివేక్ భరద్వాజ్, సింపీ భరద్వాజ్కేసు నమోదు చేసింది. అలాగే రాజ్‌కుంద్రాకు సంబంధించిన రూ.97.79కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈ కేసులో విచారణకు రావాలని సమన్లు అందడంతో శుక్రవారం ఆయన కోర్టును ఆశ్రయించారు. అనంతరం ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.


