కలం, వెబ్ డెస్క్: భారత్ ప్రతిష్టాత్మక మిషన్.. మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’ (Gaganyaan) సాకారం దిశగా మరో కీలక మైలురాయి. ఈ మిషన్‌కు సంబంధించిన డ్రోగ్ ప్యారాచూట్ వ్యవస్థ పరీక్ష విజయవంతమైంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) ఆధ్వర్యంలో చంఢీగఢ్లోని టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ లేబొరేటరీలో ఉన్న రైల్ ట్రాక్ రాకెట్ స్లైడ్ కేంద్రంలో ఈ పరీక్ష నిర్వహించారు.
విమాన ప్రయాణ సమయంలో ఎదురయ్యే గరిష్ఠ లోడ్ కంటే ఎక్కువ బరువును అనుసరించి ప్యారాచూట్ సామర్థ్యాన్ని అంచనా వేశారు. ఈ ప్యారాచూట్ తయారీలో బరువుకు సంబంధించి అదనపు భద్రత ఉన్నట్లు ప్రయోగం అనంతరం అధికారులు వెల్లడించారు. అధిక బలంతో కూడిన డ్రోగ్ ప్యారాచూట్ల తయారీలో భారత్ సామర్థ్యాన్ని ఈ ప్రయోగం నిరూపించిందని వాళ్లు తెలిపారు. ఈ పరీక్ష నిర్వహణలో ఇస్రో(ISRO), విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్, ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, మరికొన్ని ప్రత్యేక విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
డ్రోగ్ ప్యారాచూట్ ఏం చేస్తుందంటే..
అంతరిక్ష యాత్రల్లో డ్రోగ్ ప్యారాచూట్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రయోగం అనంతరం తిరిగి భూమిని చేరే సమయంలో.. బాగా ఎత్తులోనే ఇవి ముందుగా తెరుకుంటాయి. క్రూ మాడ్యూల్‌ను స్థిరపరిచి, వేగాన్ని తగ్గిస్తాయి. ఆ తర్వాతే మెయిన్ ప్యారాచూట్లు ఓపెన్ అవుతాయి. భూమిపైకి తిరిగి వచ్చే సమయంలో వేగం, గాలి శక్తులను తట్టుకోవడంలో ఇవి సాయపడతాయి. వ్యోమగాములు భద్రంగా కిందకు దిగడంలో తోడ్పడతాయి. అయితే, బరువు ఎంత వరకు మోయగలవు? సరిగా పనిచేస్తాయా? లేదా అనేదానిపై ప్రస్తుత ప్రయోగం జరిగింది. ఇందులో డ్రోగ్ ప్యారాచూట్లు శాస్త్రవేత్తల అంచనాలను అందుకున్నాయి. ప్రయోగం విజయవంతం కావడంపై వాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘గగన్‌యాన్’ (Gaganyaan) మానవ సహిత అంతరిక్ష యాత్రలో ఇస్రోతోపాటు అనేక విభాగాలు పనిచేస్తున్నాయి. ఇందులో డీఆర్డీవో కీలకంగా వ్యవహరిస్తోంది.
Read Also: వైన్స్ దుకాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
Follow Us On: Sharechat


