epaper
Sunday, February 22, 2026
epaper

‘గగన్​యాన్​’లో మరో ముందడుగు.. డ్రోగ్​​ ప్యారాచూట్ టెస్ట్​ సక్సెస్​

కలం, వెబ్​ డెస్క్​: భారత్​ ప్రతిష్టాత్మక మిషన్​​.. మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్​యాన్​’ (Gaganyaan) సాకారం దిశగా మరో కీలక మైలురాయి. ఈ మిషన్​కు సంబంధించిన డ్రోగ్ ప్యారాచూట్​ వ్యవస్థ పరీక్ష విజయవంతమైంది. ​డిఫెన్స్​ రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్​ ఆర్గనైజేషన్​(DRDO) ఆధ్వర్యంలో చంఢీగఢ్​లోని టెర్మినల్​ బాలిస్టిక్స్​ రీసెర్చ్​ లేబొరేటరీలో ఉన్న రైల్​ ట్రాక్​ రాకెట్​ స్లైడ్​ కేంద్రంలో ఈ పరీక్ష నిర్వహించారు.

విమాన ప్రయాణ సమయంలో ఎదురయ్యే గరిష్ఠ లోడ్​ కంటే ఎక్కువ బరువును అనుసరించి ప్యారాచూట్​ సామర్థ్యాన్ని అంచనా వేశారు. ఈ ప్యారాచూట్​ తయారీలో బరువుకు సంబంధించి అదనపు భద్రత ఉన్నట్లు ప్రయోగం అనంతరం అధికారులు వెల్లడించారు. అధిక బలంతో కూడిన డ్రోగ్​ ప్యారాచూట్​ల తయారీలో భారత్​ సామర్థ్యాన్ని ఈ ప్రయోగం నిరూపించిందని వాళ్లు తెలిపారు. ఈ పరీక్ష నిర్వహణలో ఇస్రో(ISRO), విక్రమ్​ సారాబాయ్​ స్పేస్​ సెంటర్​, ఏరియల్​ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్​మెంట్​ ఎస్టాబ్లిష్​మెంట్, మరికొన్ని ప్రత్యేక విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

డ్రోగ్​ ప్యారాచూట్​ ఏం చేస్తుందంటే..

అంతరిక్ష యాత్రల్లో డ్రోగ్​ ప్యారాచూట్​ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రయోగం అనంతరం తిరిగి భూమిని చేరే సమయంలో.. బాగా ఎత్తులోనే ఇవి ముందుగా తెరుకుంటాయి. క్రూ మాడ్యూల్​ను స్థిరపరిచి, వేగాన్ని తగ్గిస్తాయి. ఆ తర్వాతే మెయిన్​ ప్యారాచూట్​లు ఓపెన్​ అవుతాయి. భూమిపైకి తిరిగి వచ్చే సమయంలో వేగం, గాలి శక్తులను తట్టుకోవడంలో ఇవి సాయపడతాయి. వ్యోమగాములు భద్రంగా కిందకు దిగడంలో తోడ్పడతాయి. అయితే, బరువు ఎంత వరకు మోయగలవు? సరిగా పనిచేస్తాయా? లేదా అనేదానిపై ప్రస్తుత ప్రయోగం జరిగింది. ఇందులో డ్రోగ్​ ప్యారాచూట్​లు శాస్త్రవేత్తల అంచనాలను అందుకున్నాయి. ప్రయోగం విజయవంతం కావడంపై వాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, భారత్​ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘గగన్​యాన్​’ (Gaganyaan) మానవ సహిత అంతరిక్ష యాత్రలో ఇస్రోతోపాటు అనేక విభాగాలు పనిచేస్తున్నాయి. ఇందులో డీఆర్​డీవో కీలకంగా వ్యవహరిస్తోంది.

Read Also: వైన్స్ దుకాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>