epaper
Thursday, February 19, 2026
epaper

‘దానం’ క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాతే స్పీకర్ డెసిషన్

కలం, తెలంగాణ బ్యూరో : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై (Danam Nagender) అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన ఫిర్యాదుల విషయంలో అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లకు సంబంధించి స్పీకర్ విచారణ జరిపారు. ఎమ్మెల్యే తరపున హాజరైన న్యాయవాదులు పిటిషనర్లుగా ఉన్న ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, ఏలేటి మహేశ్వర్‌రెడ్డిలను ఐదు గంటలకు పైగా క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఎందుకు అనర్హత వేటు వేయాల్సి ఉంటుందో లీగల్‌గా, టెక్నికల్‌ కోణంలో పిటిషన్లలో లేవనెత్తిన అంశాలపై లాయర్లు ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణ దశలో ఉన్నందున బీఆర్ఎస్ తరఫున దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలు కూడా ఈ క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి.

‘దానం’ రిప్లై తర్వాతనే స్పీకర్ డెసిషన్ :

బీఆర్ఎస్ టికెట్ మీద ఎమ్మెల్యేగా ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్ (Danam Nagender) ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ బీ-ఫామ్‌ మీద సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేశారన్నది పాడి కౌశిక్‌రెడ్డి (Kaushik Reddy), ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (Alleti Maheshwar Reddy) చేసిన ప్రధాన ఆరోపణ. దీన్ని ఆధారంగా చేసుకుని ఆయనపై అనర్హత వేటు వేయాలని పిటిషన్‌లో స్పీకర్‌ను కోరారు. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ఫిరాయింపు చేశారనడానికి ఈ అంశం కీలక ఆధారమని విచారణ సందర్భంగా దానం నాగేందర్ తరఫు న్యాయవాదులకు వివరించారు. పాడి కౌశిక్‌రెడ్డిని ఈ నెల 4వ తేదీనే క్రాస్ ఎగ్జామిన్ చేసే ప్రక్రియ పూర్తయింది. మరోసారి బుధవారం సైతం దానం నాగేందర్‌ తరఫు లాయర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై స్వయంగా దానం నాగేందర్‌ను స్పీకర్ విచారించి ఆయన ఇచ్చే సమాధానాలకు అనుగుణంగా అనర్హతపై నిర్ణయం తీసుకోనున్నారు.

‘దానం’ను బీఆర్ఎస్ సస్పెండ్ చేసిందా? :

దానం నాగేందర్‌ను బీఆర్ఎస్ సస్పెండ్ చేసిన విషయం కూడా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని లాయర్లు క్రాస్ ఎగ్జామిన్ చేసే సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో బీఆర్ఎస్ తరఫున దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ అంశాన్ని పొందుపరిచిన సంగతి తెలుసా అంటూ న్యాయవాదుల ప్రశ్నించారని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మీడియాకు వివరించారు. అఫిడవిట్ దాఖలు చేసి నెలలు గడుస్తున్నా ఈ విషయాన్ని బీఆర్ఎస్ బహిర్గతం చేయలేదని గుర్తుచేశారు. నిజంగా అఫిడవిట్‌లో ఈ అంశాన్ని బీఆర్ఎస్ పేర్కొన్నట్లయితే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడే అవకాశమే లేదన్నారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఏ పార్టీలో చేరినా అది సంబంధం లేని అంశం అవుతుందని, అనర్హత వేటు వేయాలన్న డిమాండ్ అర్థరహితమవుతుందన్నది ఏలేటి వాదన. లాయర్లు ప్రస్తావించినట్లుగా బీఆర్ఎస్ అఫిడవిట్‌లో దానం నాగేందర్‌ను సస్పెండ్ చేసిన అంశం ఉన్నదీ లేనిది ఆసక్తికరంగా మారింది.

మూడు రంగుల కండువా చుట్టే వివాదం :

దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారనడానికి ఉన్న ఆధారాలపైనా లాయర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ అంశం గురించి ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, దానం నాగేందర్ మూడు రంగుల కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారని క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. కానీ దానికి లాయర్లు ఆ కండువా పై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల చిహ్నం ‘హస్తం’ గుర్తు లేదు కదా అని ఎదురు ప్రశ్నించినట్లు తెలిపారు. మూడు రంగుల కండువు కాంగ్రెస్ పార్టీకి చెందినదే అని తాను చెప్పినట్లు వివరించారు. కాంగ్రెస్ ఎన్నికల చిహ్నం లేని మూడు రంగుల కండువా ఆ పార్టీదో కాదో నిర్ధారించడం క్రాస్ ఎగ్జామినేషన్‌లో కీలక అంశంగా మారింది. పార్టీ మారినవారిని రాళ్లతో కొట్టి చంపాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలుమార్లు అన్నారని, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని రాహుల్‌గాంధీ తిరుగుతున్నారని, వీటిని గమనంలోకి తీసుకుని దానం నాగేందర్ పార్టీ ఫిరాయించారనే నిర్ణయానికి వచ్చి అనర్హత వేటు వేస్తారనే భావిస్తున్నట్లు పాడి కౌశిక్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

Read Also: రాణించిన దూబె, వరుణ్​.. దర్జాగా సూపర్​–8కు భారత్​

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>