epaper
Wednesday, February 18, 2026
epaper

కుటుంబ సభ్యుల జోక్యం వద్దు.. సర్పంచులకు కలెక్టర్ కీలక సూచన

కలం, నిజామాబాద్ బ్యూరో : పల్లెల సర్వతోముఖాభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తూ, మహిళా శక్తి సామర్థ్యం చాటాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన మహిళా సర్పంచులకు నిజామాబాద్ న్యాక్ భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ త్రిపాఠి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా సర్పంచుల అధికారాలు, విధులు, బాధ్యతల గురించి వివరిస్తూ అవగాహన కల్పించారు. ఐదు రోజుల పాటు కొనసాగే శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అన్ని రంగాలలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలనే సదుద్దేశ్యంతో స్థానిక సంస్థలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించినట్లు కలెక్టర్​ తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళా సర్పంచులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని, గ్రామాలలో సమర్ధవంతమైన పాలనను అందిస్తూ రిజర్వేషన్లకు సార్థకత చేకూర్చాలని హితవు పలికారు. గ్రామ పాలనలో కుటుంబ సభ్యుల జోక్యానికి అవకాశం ఇవ్వకుండా, గ్రామ ప్రథమ పౌరులుగా గౌరవాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన 10 మంది సర్పంచులను ఉత్తమ సర్పంచులుగా ఎంపిక చేసి సన్మానిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా ఆదర్శ గ్రామంగా గుర్తింపు పొందిన గంగాదేవిపల్లి (Gangadevipalli) సందర్శనకు అధ్యయన యాత్ర కోసం పంపిస్తామని అన్నారు. శిక్షణా తరగతులలో చెప్పే ప్రతి అంశాన్ని చక్కగా ఆకళింపు చేసుకుని, గ్రామాలలో సమర్థ పాలనను అందిస్తూ ప్రతి ఒక్కరూ ఉత్తమ సర్పంచులుగా గుర్తింపు పొందాలని కలెక్టర్ (Ila Tripathi) ఆకాంక్షించారు. శిక్షణా కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి డి.శ్రీనివాస్ రావు, ఏ.ఓ రాజాబాబు, డీ.ఎల్.పీ.ఓలు, ఆయా గ్రామాల మహిళా సర్పంచులు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.

 Read Also: ఎల్లుండి ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. కీలక అంశాలపై చర్చ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>