కలం, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు టైటిల్ ఫేవరెట్లలో ఆస్ట్రేలియా ఒకటి. కానీ, లీగ్ దశలో ఆ జట్టు పోరాటాన్ని చూస్తే కనీసం సూపర్–8కి అయినా చేరుతుందా అనిపిస్తోంది. కారణం.. చిన్న జట్టయిన జింబాబ్బే చేతిలో ఖంగుతిన్న ఆసిస్ సోమవారం ఆతిథ్య లంక చేతిలో పరాజయం మూటగట్టుకుంది (Pathum Nissanka). పల్లెకెలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా సరిగ్గా 20 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(56; 29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), మిచెల్ మార్ష్(54; 27 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో చెలరేగడంతో ఒక దశలో వికెట్ నష్టపోకుండా 8 ఓవర్లలోనే 104 పరుగులు చేసింది. అయితే, ఆ తర్వాత తడబడింది. మిడిలార్డర్లో జోష్ ఇంగ్లిస్(27), గ్లెన్ మాక్స్వెల్(22) మినహా మిగిలినవాళ్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
ఛేదనలో ఓపెనర్ కుశాల్ పెరీరా(1) త్వరగానే పెవిలియన్ చేరినప్పటికీ మరో ఓపెనర్ నిశాంక(100 నాటౌట్; 52 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లు), (Pathum Nissanka) కుశాల్ మెండిస్(51; 38 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్)తో కలసి రెండో వికెట్‌కు 97 పరుగులు జోడించాడు. అనంతరం పవన్ రత్నాయకే(28 నాటౌట్; 15 బంతుల్లో 6 ఫోర్లు) తోడుగా జట్టును విజయం వైపు నడిపించాడు. ఈ క్రమంలో టోర్నీలో తొలి సెంచరీ నమోదు చేశాడు. శ్రీలంక కోల్పోయిన రెండు వికెట్లూ స్టొయినిస్‌కు దక్కాయి. నిశాంక ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
టోర్నీలో ఇప్పటివరకూ మూడు మ్యాచ్‌లు ఆడిన ఆసిస్ 1 గెలుపు, 2 పరాజయాలతో కేవలం 2 పాయింట్లు మాత్రమే సంపాదించింది. సూపర్8కు ఆసిస్ చేరడం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంది.


