కలం, వెబ్‌డెస్క్: కేరళలో కాంగ్రెస్ గెలవదు.. పవన్ ఖేరా ఓ తోలుబొమ్మ.. శశిథరూర్ విదేశాంగ మంత్రి పదవి కోరుకుంటున్నారు.. కేరళలో మళ్లీ సీఎం పినరయి విజయన్ ముఖ్యమంత్రి అవుతారు.. ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? కాంగ్రెస్ సీనియర్ నేత మణి శంకర్ అయ్యర్ (Mani Shankar Aiyar) సొంత పార్టీ మీద చేసిన వ్యాఖ్యలు. వీటన్నింటి కంటే మించినది మరొకటుంది.. అది ‘నేను గాంధేయవాదిని. నెహ్రూ, రాజీవ్‌కు శిష్యున్ని. కానీ, రాహుల్ గాంధీకి కాదు’. అసలే కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా ఏ ఎన్నికలు జరిగినా చతికిలపడుతున్న కాంగ్రెస్‌లో ఇప్పుడు మణి శంకర్ అయ్యర్ వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి.
కేరళ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ క్రమంలో మణిశంకర్ అయ్యర్ ఇటీవల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా పార్టీ అధికార ప్రతినిధి కాదని, ఓ తోలుబొమ్మని వ్యాఖ్యానించారు. ‘ఆయన రెండేళ్లుగా నాపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అధికార ప్రతినిధిగా తప్పించకుంటే ఇప్పుడున్న స్థితిలోనే కాంగ్రెస్ ఉంటుంది’ అని మణి శంకర్ అయ్యర్ అన్నారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ విజయావకాశాల గురించి మాట్లాడుతూ ‘కేరళలో కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటున్నాను. కానీ, అక్కడ కాంగ్రెస్ నాయకుల మధ్య విబేధాల కారణంగా గెలుపు కష్టమే. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు.. కమ్యూనిస్టులను ద్వేషించడం కంటే ఒకరినొకరు తిట్టుకోవడంతోనే సరిపోతోంది’ అని వ్యాఖ్యానించారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పనితీరును మెచ్చుకోవడంతోపాటు మళ్లీ ఆయనే సీఎం అవుతారని చెప్పారు. అలాగే, మరో ఇంటర్వ్యూలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. శశిథరూర్ పాకిస్థాన్‌కు బద్ద వ్యతిరేకి అని, విదేశాంగ మంత్రి పదవి కోరుకుంటున్నాడని ఆరోపించారు. నిరుడు ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రధాని మోదీని ప్రశంసించిన థరూర్.. అనంతరం సిందూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించే కమిటీలో చోటు దక్కించుకోవడాన్ని ఉదాహరణగా చెప్పారు. అలాగే కాంగ్రెస్ మీడియా వ్యవహారాల ప్రతినిధి జైరామ్ రమేశ్ పనితీరునూ అయ్యర్ తప్పుపట్టారు.
మరోవైపు.. మణి శంకర్ అయ్యర్ (Mani Shankar Aiyar) చాలా రోజుల నుంచి పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడం లేదని, ఆయనకు పార్టీతో సంబంధం లేదని కాంగ్రెస్ నేత దీపా దాస్ మున్షీ అన్నారు.
కాగా, 84 ఏళ్ల అయ్యర్ దేశ విభజనకు ముందు లాహోర్(ప్రస్తుతం పాకిస్థాన్)లో జన్మించారు. స్వాతంత్ర్యం అనంతరం అయ్యర్ కుటుంబం దేశానికి తరలివచ్చింది. ఢిల్లీలో ఉన్నత విద్య పూర్తిచేసిన అయ్యర్.. రాజకీయాల్లోకి వచ్చాక తమిళనాడులోని మైలాదుతురై లోక్‌సభ స్థానం నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచారు.
Read Also: 5 ఊర్లను తెలంగాణలో కలపాలని చంద్రబాబును అడిగాం : తుమ్మల
Follow Us On: Sharechat


