epaper
Wednesday, February 18, 2026
epaper

అయ్యారే.. కాంగ్రెస్​లో మణిశంకర్​ వ్యాఖ్యల కలకలం

కలం, వెబ్​డెస్క్​: కేరళలో కాంగ్రెస్​ గెలవదు.. పవన్​ ఖేరా ఓ తోలుబొమ్మ.. శశిథరూర్​ విదేశాంగ మంత్రి పదవి కోరుకుంటున్నారు.. కేరళలో మళ్లీ సీఎం పినరయి విజయన్​ ముఖ్యమంత్రి అవుతారు.. ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? కాంగ్రెస్​ సీనియర్​ నేత మణి శంకర్ అయ్యర్ (Mani Shankar Aiyar)​ సొంత పార్టీ మీద చేసిన వ్యాఖ్యలు. వీటన్నింటి కంటే మించినది మరొకటుంది.. అది ‘నేను గాంధేయవాదిని. నెహ్రూ, రాజీవ్​కు శిష్యున్ని. కానీ, రాహుల్​ గాంధీకి కాదు’. అసలే కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా ఏ ఎన్నికలు జరిగినా చతికిలపడుతున్న కాంగ్రెస్​లో ఇప్పుడు మణి శంకర్​ అయ్యర్​ వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి.

కేరళ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ క్రమంలో మణిశంకర్​ అయ్యర్​ ఇటీవల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్​ సీనియర్​ నేత పవన్​ ఖేరా పార్టీ అధికార ప్రతినిధి కాదని, ఓ తోలుబొమ్మని వ్యాఖ్యానించారు. ‘ఆయన రెండేళ్లుగా నాపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అధికార ప్రతినిధిగా తప్పించకుంటే ఇప్పుడున్న స్థితిలోనే కాంగ్రెస్ ఉంటుంది’ అని మణి శంకర్​ అయ్యర్​ అన్నారు. కేరళలో కాంగ్రెస్​ పార్టీ విజయావకాశాల గురించి మాట్లాడుతూ ‘కేరళలో కాంగ్రెస్​ గెలవాలని కోరుకుంటున్నాను. కానీ, అక్కడ కాంగ్రెస్​ నాయకుల మధ్య విబేధాల కారణంగా గెలుపు కష్టమే. ఎందుకంటే కాంగ్రెస్​ నాయకులు.. కమ్యూనిస్టులను ద్వేషించడం కంటే ఒకరినొకరు తిట్టుకోవడంతోనే సరిపోతోంది’ అని వ్యాఖ్యానించారు.

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​ పనితీరును మెచ్చుకోవడంతోపాటు మళ్లీ ఆయనే సీఎం అవుతారని చెప్పారు. అలాగే, మరో ఇంటర్వ్యూలో కాంగ్రెస్​ ఎంపీ శశిథరూర్​పై సంచలన వ్యాఖ్యలు చేశారు. శశిథరూర్​ పాకిస్థాన్​కు బద్ద వ్యతిరేకి అని, విదేశాంగ మంత్రి పదవి కోరుకుంటున్నాడని ఆరోపించారు. నిరుడు ఆపరేషన్​ సిందూర్​ సమయంలో ప్రధాని మోదీని ప్రశంసించిన థరూర్​.. అనంతరం సిందూర్​ గురించి ప్రపంచ దేశాలకు వివరించే కమిటీలో చోటు దక్కించుకోవడాన్ని ఉదాహరణగా చెప్పారు. అలాగే కాంగ్రెస్​ మీడియా వ్యవహారాల ప్రతినిధి జైరామ్​ రమేశ్​ పనితీరునూ అయ్యర్​ తప్పుపట్టారు.

మరోవైపు.. మణి శంకర్​ అయ్యర్ (Mani Shankar Aiyar)​ చాలా రోజుల నుంచి పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడం లేదని, ఆయనకు పార్టీతో సంబంధం లేదని కాంగ్రెస్​ నేత దీపా దాస్​ మున్షీ అన్నారు.

కాగా, 84 ఏళ్ల అయ్యర్​ దేశ విభజనకు ముందు లాహోర్​(ప్రస్తుతం పాకిస్థాన్​)లో జన్మించారు. స్వాతంత్ర్యం అనంతరం అయ్యర్​ కుటుంబం దేశానికి తరలివచ్చింది. ఢిల్లీలో ఉన్నత విద్య పూర్తిచేసిన అయ్యర్​.. రాజకీయాల్లోకి వచ్చాక తమిళనాడులోని మైలాదుతురై లోక్​సభ స్థానం నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచారు.

Read Also: 5 ఊర్లను తెలంగాణలో కలపాలని చంద్రబాబును అడిగాం : తుమ్మల

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>