కలం, వెబ్డెస్క్: రాబోయే రెండో బిడ్డ జ్ఞాపకాలను ఫొటోల రూపంలో భద్రపరచుకోవాలని అనుకుందా తల్లి (Bengaluru Toddler). తాను గర్భంతో ఉండగా తీసిన ఫొటోలను అపురూపంగా దాచుకోవాలని భావించింది. కానీ, విధి నిర్ణయం మరోలా ఉంది. రెండో బిడ్డ కడపులో ఉండగా మెటర్నటీ ఫొటో షూట్ ఒకవైపు జరుగుతుండగా, మరోవైపు ఆమె మూడేళ్ల మొదటి కుమారుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాద సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో సోమవారం జరిగింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని జేపీ నగర్లో నివసించే చరణ్ రాజ్, స్వాతి దంపతులకు లక్ష్వీర్(3) అనే బాబు ఉన్నాడు (Bengaluru Toddler). సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన చరణ్.. ఉద్యోగ రీత్యా ఆదివారం అమెరికా వెళ్లారు. ఎనిమిది నెలల గర్భిణి అయిన స్వాతి, స్నేహితురాలితో కలసి మదనాయకనహల్లిలోని గిద్దెనహల్లిలో ఉన్న ఓ ఫొటో స్టూడియోకు స్వాతి వెళ్లింది. ఆమె వెంట లక్ష్వీర్ ఉన్నాడు.
మెటర్నటీ ఫొటో షూట్ అనంతరం చూస్తే బాబు కనిపించలేదు. దీంతో వాళ్లు కంగారు పడి వెతకగా, అక్కడే ఉన్న ఓ చిన్న నీటి కుంటలో పడిన బాలుడు కనిపించాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆ చిన్నారి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆ తల్లి రోదనలు మిన్నంటాయి. రెండో బిడ్డ జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోవాలని వస్తే, మొదటి బిడ్డ దూరమయ్యాడంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: అల్లూరి జిల్లాలో రూ.కోటి విలువైన గంజాయి పట్టివేత
Follow Us On : WhatsApp


