కలం, వెబ్‌డెస్క్: ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 15 ఏళ్లు సహజీవనం చేశారు. అయితే, పెళ్లి అనేసరికి విభేదాలు వచ్చాయి. అంతే, ప్రేమికురాలిని తుపాకీతో కాల్చి తానూ చనిపోయాడు. ఈ సంఘటన ప్రేమికుల రోజైన శనివారం ఢిల్లీ శివారులోని నోయిడా (Noida)లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు ఉదయం దాద్రి రోడ్డులోని పిల్లర్ నెం.84 వద్ద ఓ కారు అనుమానాస్పదంగా ఉన్నట్లు సెక్టార్ 39 పోలీసులకు సమాచారం అందింది. వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా, డోర్లు లోపలి వైపు నుంచి లాక్ వేసినట్లు గుర్తించారు. వెంటనే మెకానిక్‌ను రప్పించి తెరిపించి చూడగా లోపల రెండు మృతదేహాలు కనిపించాయి. ఓ వ్యక్తి మహిళను కాల్చి చంపి, అనంతరం తానూ కాల్చుకొని చనిపోయినట్లు గుర్తించారు. అంతేకాదు, లోపల ఓ లేఖ రాసి ఉండడం గమనించారు.
అందులో ఉన్న వివరాల ప్రకారం సుమిత్ (31), రేఖ(26) దాదాపు 15 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే, ఇటీవల రేఖకు పెళ్లి నిశ్చయమైంది. దీంతో తాము విడిపోదామని చెప్పింది. దీనికి అంగీకరించని సుమిత్.. మాట్లాడుకుందామంటూ యువతిని పిలిచాడు. ఇద్దరూ కార్లో వెళుతుండగా, మాటామాటా పెరిగింది. సుమిత్ ఆవేశంలో తుపాకీతో రేఖను కాల్చి చంపాడు. అనంతరం తానూ కాల్చుకొని చనిపోయాడు. కాగా, వీళ్లిద్దరూ కనిపించడం లేదంటూ వాళ్ల తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చారు. సుమిత్‌ది ఢిల్లీలోని త్రిలోక్‌పురి కాగా, రేఖ కుటుంబం నోయిడా (Noida) లోని సెక్టార్ 101లో ఉంటోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: అమెరికాలో ఇండియన్ స్టూడెంట్ మిస్సింగ్.. ఐదు రోజులైనా!
Follow Us On : WhatsApp


