కలం, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) దర్యాప్తు హడావిడి ముగియడంతో ఇప్పుడు ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో (Formula E Case) కదలిక వచ్చింది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను (Arvind Kumar IAS) ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేసులో ఆయన ఏ-2గా ఉండడంతో ఆయనను విచారించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా డిసెంబరులో రాష్ట్ర ప్రభుత్వం డీవోపీటీకి లేఖ రాసింది. మూడు నెలల తర్వాత కదలిక వచ్చింది. ఆయనను ప్రాసిక్యూట్ చేయడానికి ఎట్టకేలకు అనుమతి లభించింది. దీంతో ఏసీబీ రంగంలోకి దిగనున్నది. ఎప్పుడు విచారిస్తుందన్నది కీలకంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్‌ను పలుమార్లు విచారించారు. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. చార్జిషీట్‌ను రూపొందించి కోర్టులో దాఖలు చేయడానికి ముందు మరికొన్ని వివరాలను రాబట్టాలని ఏసీబీ భావిస్తే మరోమారు అరవింద్‌కుమార్‌ను విచారించే అవకాశమున్నది.
గవర్నర్ అనుమతితో కేటీఆర్ ఎంక్వయిరీ :
ఫార్ములా ఈ-కార్ రేసులో (Formula E Case) గవర్నర్ అనుమతితో కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గతంలోనే లైన్ క్లియర్ అయింది. నాలుగుసార్లు ఏసీబీ అధికారుల ముందు కేటీఆర్ (KTR) హాజరయ్యారు. మనీ లాండరింగ్ ఆరోపణలతో ఇదే కేసులో ఈడీ కూడా ఆయనను ప్రశ్నించింది. స్టేట్‌మెంట్లను ఏసీబీ, ఈడీ రికార్డు చేసింది. అరవింద్ కుమార్‌ను విచారించడానికి డీవోపీటీ నుంచి తెలంగాణ ఏసీబీ అధికారులకు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇక ఈ కేసు దర్యాప్తు మరో మలుపు తీసుకోనున్నది. చార్జిషీట్‌లో ఏసీబీ అధికారులు ఏయే అంశాలను పేర్కొని ఆయనపై ఎలాంటి అభియోగాలు నమోదు చేస్తారన్నది కీలకంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవకతవకలపై అనేక కేసులపై దర్యాప్తు వివిధ దశల్లో ఉన్నది. ఇప్పుడు అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్‌కు ఫార్ములా కార్ రేసులో కేంద్రం నుంచి అనుమతి రావడంతో మరోసారి బీఆర్ఎస్ నేతల్లో గుబులు మొదలుకానున్నది.
Read Also: కమిషన్లు, సీబీఐ, ఈడీ… అయినా సస్పెన్స్!
Follow Us On: Instagram


