epaper
Wednesday, February 18, 2026
epaper

నల్లగొండ జిల్లాలో పోలింగ్ ప్రశాంతం

కలం, నల్లగొండ బ్యూరో: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నల్లగొండ కార్పొరేషన్‌తో సహా 17 మున్సిపాలిటీల్లోని 359 వార్డులకు మున్సిపల్ ఎన్నికలు (Municipal Elections)  జరిగాయి. ఈ ఎన్నికల బరిలో 1617 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, వారి భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమయ్యింది. శుక్రవారం అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

ఉమ్మడి జిల్లాలో నల్లగొండలో 78.09 శాతం పోలింగ్ నమోదు కాగా, సూర్యాపేట జిల్లాలో 79.10 శాతం, యాదాద్రి భువనగిరి జిల్లాలో 87.01 శాతం పోలింగ్ నమోదయ్యింది. కాగా, ఫిబ్రవరి 16న మున్సిపాలిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్ల పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలావుంటే.. ఆయా మున్సిపాలిటీల్లో గతంతో పోల్చితే కొన్ని మున్సిపాలిటీల్లో పోలింగ్ శాతం పెరగ్గా, కొన్నింటిలో తగ్గింది. దీంతో రాజకీయ పార్టీలు, బరిలో నిలిచిన అభ్యర్థులు గెలుపోటములపై లెక్కలు వేయడంలో బిజీగా మారారు.

భారీగా దొంగ ఓట్ల కలకలం

నల్లగొండ జిల్లా కేంద్రంతో పాటు హాలియా మున్సిపాలిటీలోనూ (Haliya Municipality) దొంగ ఓట్ల కలకలం రేగింది. నల్లగొండ కార్పొరేషన్ పరిధిలోని 33వ వార్డులో విదేశాల్లో ఉన్న ఓటర్ల ఆధార్ కార్డు మార్ఫింగ్ చేసి ఓటు వేసినట్టు బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. హాలియా మున్సిపాలిటీలో ఏడో వార్డులో అమెరికాలో ఉన్న వీరమల్లు నిఖిల్, వీరమల్లు వెంకటేశ్వర్లు, వీరమల్లు జ్యోతిలకు సంబంధించిన ఓట్లను ముగ్గురు వ్యక్తులు వేసినట్టు బీఆర్ఎస్ ఆరోపించింది.

ఈ క్రమంలోనే ఎన్నికల అధికారి ఆ ముగ్గురు వ్యక్తులను సీసీ ఫుటేజీలలో గమనించి చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ డిమాండ్ చేశారు. మరోవైపు మిర్యాలగూడ మున్సిపాలిటీలోని బంగారుగడ్డ 32వ వార్డులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ బూతులో ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తి తండ్రి పేరులో తేడా విషయంలో ఘర్షణ తలెత్తింది. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు పోలింగ్ బూతులోనే పరస్పర దాడులకు దిగారు. దీంతో ఇరువర్గాలపై పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు.

నల్లగొండ జిల్లాలో పోలింగ్ శాతం

నల్లగొండ జిల్లాలో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు (Nalgonda Corporation) మరో ఆరు మున్సిపాలిటీల్లోని 161 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఈ ఏడు మున్సిపాలిటీల్లో 3,07,992 మంది ఓటర్లు ఉండగా, 2,40,514 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తానికి నల్లగొండ జిల్లాలో 78.09 శాతం పోలింగ్ నమోదయ్యింది. చండూరు మున్సిపాలిటీలో అత్యధికంగా 91.52 శాతం పోలింగ్ నమోదు కాగా, నందికొండ మున్సిపాలిటీలో అత్యల్పంగా 59.68 శాతం పోలింగ్ నమోదయ్యింది. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో 77.36 శాతం, మిర్యాలగూడలో 77.44 శాతం, దేవరకొండలో 80.26 శాతం, హాలియాలో 85.78 శాతం, చిట్యాలలో 87.88 శాతం పోలింగ్ నమోదయ్యింది.

సూర్యాపేట జిల్లాలో ఇలా..

సూర్యాపేట జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లోని 137 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 2,19,972 మంది ఓటర్లకు 1,75,759 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తానికి సూర్యాపేట జిల్లాలో 79.10 శాతం పోలింగ్ నమోదయ్యింది. అత్యధికంగా తిరుమలగిరి మున్సిపాలిటీలో 88.36 శాతం పోలింగ్ నమోదు కాగా, హుజూర్‌నగర్ మున్సిపాలిటీలో 82.88 శాతం, కోదాడలో 77.05 శాతం, నేరేడుచర్లలో 79.24 శాతం, సూర్యాపేటలో 79.38 శాతం పోలింగ్ నమోదయ్యింది.

యాదాద్రి జిల్లాలో పోలింగ్ శాతం ఎంతంటే..

యాదాద్రి జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో 87.01 శాతం పోలింగ్ నమోదయ్యింది. 102 వార్డుల్లో 1,30,192 మంది ఓటర్లు ఉండగా, పోలింగ్ ముగిసే సమయానికి 1,13,398 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలో 91.91 శాతం పోలింగ్ నమోదు కాగా, ఆలేరు మున్సిపాలిటీలో 85.81 శాతం, భువనగిరి మున్సిపాలిటీలో 82.93 శాతం, మోత్కూరు మున్సిపాలిటీలో 86.92 శాతం, పోచంపల్లి మున్సిపాలిటీలో 90.95 శాతం, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 89.96 శాతం పోలింగ్ (Municipal Elections) నమోదయ్యింది.

Read Also: ఎమ్మెల్యే, సీఐ మధ్య వాగ్వివాదం

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>