కలం, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పై ‘చేయి’ సాధించినట్లేనా?.. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ (BRS) చతికిలపడిందా?.. ఈసారి బీజేపీ కాస్త బలం పుంజుకుంటున్నదా?.. మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళి పై సంకేతాలనే ఇస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ (Municipal Exit Polls) అంచనాలను వెల్లడించిన సర్వే సంస్థలు సైతం అదే ట్రెండ్‌ను వెల్లడించాయి. ఈసారి ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా ఒక్కటి కూడా బీఆర్ఎస్‌కు వచ్చేలా లేదన్నది సర్వే సంస్థల అంచనా. 2020లో మొత్తం పది కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే అన్నింటినీ చేజిక్కించుకున్న బీఆర్ఎస్ ఈసారి పార్లమెంటు ఎన్నికల తరహాలోనే మరో ‘గుండు సున్నా’ తప్పదేమో. రెండు కార్పొరేషన్లు బీజేపీకి, మిగిలినవన్నీ కాంగ్రెస్‌కు దక్కేలా ఉన్నాయన్నది ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
సిట్టింగ్ అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం :
సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్ (Municipal Exit Polls) అంచనాల్లో కాంగ్రెస్ 85కు పైగా మున్సిపాలిటీల్లో గెలిచి ఫస్ట్ ప్లేస్‌లో ఉండనున్నది. ఆ తర్వాత పాతిక స్థానాలతో బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్‌లో, నాలుగైదు స్థానాలతో బీజేపీ థర్డ్ ప్లేస్‌లో ఉండనున్నాయి. చాలాచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు వారి పరిధిలోని మున్సిపాలిటీల్లో గెలవాలనే టార్గెట్ పెట్టుకున్నారు. కొన్నిచోట్ల పోలింగ్ సరళి అదే తీరులో కనిపిస్తున్నా కొన్ని చోట్ల బెడిసికొట్టిన వాతావరణమే నెలకొన్నది. సంగారెడ్డి బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైనా అక్కడ కాంగ్రెస్‌కే విజయావకాశాలున్నాయి. బీజేపీ మాత్రం ఎనిమిది ఎమ్మెల్యేలున్నా వారి పరిధిలోని మున్సిపాలిటీలను గెలిపించుకోలేకపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా ఆ రెండు జిల్లాల్లో ఒక్క మున్సిపాలిటీ కూడా దక్కించుకునే అవకాశాల్లేవ్.
అంచనాలకు తగినట్లే కాంగ్రెస్ దూకుడు :
మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు జరుగుతున్న ఎన్నికల్లో సెంచరీ సాధించడం పక్కా అని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రులంతా వారి సొంత జిల్లాలతో పాటు ఇన్‌చార్జిగా వ్యవహరించే జిల్లాల్లోనే మకాం వేశారు. ముమ్మరంగా ప్రచారం చేశారు. దాదాపు వారం రోజులు ముఖ్యమంత్రి జిల్లాల్లో బహిరంగసభల్లో పాల్గొని శ్రేణుల్ని ఉత్సాహపరిచారు. ప్రజలకు రెండేండ్ల ప్రగతిని వివరించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం కుదేలైందని ఆరోపించారు. పోలింగ్ పూర్తయ్యేంత వరకూ మంత్రులు, కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వారివారి ప్రాంతాల్లోనే ఉండాలని సీఎంతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan), పీసీసీ చీఫ్ నొక్కి చెప్పారు. సమిష్టి కృషి ఫలితం ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో ప్రతిబింబించిందని, విజయం ఖాయమన్నది ఆ పార్టీ నేతల విశ్వాసం.
దక్షిణ తెలంగాణలో మరింత పట్టు :
సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం నల్లగొండ జిల్లాలోని మొత్తం 17 మున్సిపాలిటీలు, ఖమ్మం జిల్లాలోని మొత్తం ఏడు మున్సిపాలిటీలు, రంగారెడ్డి జిల్లాల్లోని 13లో 11 మున్సిపాలిటీలు, మహబూబ్‌నగర్ జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో 11 కాంగ్రెస్ గెల్చుకునే అవకాశమున్నది. ఈ నాలుగు జిల్లాల్లోని మొత్తం 55 మున్సిపాలిటీల్లో 46 చోట్ల కాంగ్రెస్ చైర్‌పర్సన్లు ఎన్నికయ్యే అవకాశమున్నది. రంగారెడ్డి జిల్లాలోని అలియాబాద్, ఎల్లంపేట మాత్రం బీఆర్ఎస్‌కు దక్కే అవకాశమున్నదని, మహబూబ్‌నగర్ జిల్లాలో చిన్న మున్సిపాలిటీలుగా ఉన్న దేవరకద్ర, కొత్తకోట, మక్తల్, ఆత్మకూరుల్లో కాంగ్రెస్‌తో గట్టి పోటీ ఉన్నా చివరకు బీజేపీ గెల్చుకుంటుందని తేలింది. ఈ జిల్లాలో బీఆర్ఎస్ ఐజ, వడ్డేపల్లి, నారాయణపేటలో మాత్రం స్వల్ప తేడాతో బీఆర్ఎస్ గట్టెక్కవచ్చని అంచనా.
మెదక్ జిల్లాల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ డౌన్ :
ఉమ్మడి మెదక్ జిల్లాలోని మొత్తం 19మున్సిపాలిటీలలో బీఆర్ఎస్, కాంగ్రెస్ చెరి సగం గెల్చుకునే వాతావరణం నెలకొన్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు ఈ జిల్లాలోనే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి ఈ జిల్లా కంచుకోట అనే గుర్తింపు ఉన్నది. గతంతో పోలిస్తే ఈసారి బీఆర్ఎస్ ప్రభావం గణనీయంగా తగ్గుతున్నది. దాని గ్రాఫ్ డౌన్ అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ కూడా కాంగ్రెస్ సంగారెడ్డి, సదాశివపేట, ఆంధోల్, కోహిర్, నారాయణఖేడ్, తూప్రాన్, హుస్నాబాద్, చేర్యాల, ఇస్నాపూర్ తదితర మున్సిపాలిటీలను గెల్చుకునేలా ఉన్నది. కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్, దుబ్బాక, రామాయంపేట్, నర్సాపూర్, మెదక్, జహీరాబాద్, జిన్నారం, ఇంద్రేశం, గుమ్మడిదల, గడ్డిపోతారం మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పైచేయిగా ఉన్నది. ఈ జిల్లాలో ఒక్కటి కూడా బీజేపీకి దక్కే అవకాశం లేదు. పార్లమెంటు ఎన్నికల్లో ‘గుండు సున్నా’ అంటూ విమర్శలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ అదే తరహా నిందలు మోయాల్సి వస్తున్నది.
కమలం ఖాతాలో రెండు కార్పొరేషన్లు ! :
గత ఎన్నికల్లో కొద్ది తేడాతో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను (Nizamabad Corporation) చేజార్చుకున్నా ఈసారి విజయం పక్కా అనే ధీమాతో ఉన్నది. దీనికి తోడు కరీంనగర్‌లో సైతం గెలుపు ఖాయమంటున్నది. ఈ రెండు చోట్లా బీజేపీ ఎంపీలే ఉన్నారు. బండి సంజయ్ కరీంనగర్‌పై ఫోకస్ పెట్టగా ధర్మపురి అరవింద్ (MP Arvind) నిజామాబాద్‌పై దృష్టి సారించారు. మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ ప్రచారంతో నాలుగైదు మున్సిపాలిటీలు ఆ పార్టీ గెల్చుకునే అవకాశమున్నది. ఇవి మినహా రాష్ట్రంలో ఇంకెక్కడా బీజేపీకి మున్సిపాలిటీల్లో గెలిచే అవకాశాలు చాలా తక్కువ. మెదక్, చేవెళ్ళ, మల్కాజిగిరి, ఆదిలాబాద్ ఎంపీ స్థానాలు బీజేపీవే అయినా మున్సిపల్ ఎన్నికల్లో ఆ ప్రభావం పెద్దగా లేదు. ఇందులో కొన్ని సెగ్మెంట్ల ప్రాంతాలు జీహెచ్ఎంసీలో ఉండడంతో ఇప్పుడు ఎన్నికలు జరగలేదు.
ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇవీ :
అన్ని జిల్లాల్లోని 116 మున్సిపాలిటీల్లో.. : కాంగ్రెస్-85, బీఆర్ఎస్-25, బీజేపీ-5
ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో.. : కాంగ్రెస్-5, బీజేపీ-2, బీఆర్ఎస్-0
ఆదిలాబాద్ జిల్లా (10) : కాంగ్రెస్-6, బీఆర్ఎస్-3, మజ్లిస్-1 (భైంసా), బీజేపీ-0
నిజామాబాద్ జిల్లా (7) : కాంగ్రెస్-6, ఆర్మూర్-టఫ్ ఫైట్
కరీంనగర్ జిల్లా (13) : కాంగ్రెస్-9, బీఆర్ఎస్-1, టఫ్ ఫైట్-3
వరంగల్ జిల్లా (12) : కాంగ్రెస్-8, బీఆర్ఎస్-4, బీజేపీ-0
మెదక్ జిల్లా (19) : కాంగ్రెస్-9, బీఆర్ఎస్-10, బీజేపీ-0
రంగారెడ్డి జిల్లా (13) : కాంగ్రెస్-11, బీఆర్ఎస్-2, బీజేపీ-0
నల్లగొండ జిల్లా (17) : కాంగ్రెస్-17, బీఆర్ఎస్-0, బీజేపీ-0
మహబూబ్‌నగర్ (18) : కాంగ్రెస్-11, బీజేపీ-4, బీఆర్ఎస్-3
ఖమ్మం జిల్లా (7) : కాంగ్రెస్-7, బీఆర్ఎస్-0, బీజేపీ-0
Read Also: ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు.. నాడు హెగ్డే.. నేడు కేసీఆర్
Follow Us On: Instagram


