కవిత(Kavitha) కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవిత జాగృతి పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్‌ను మినహాయించి అందరు నేతల మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఆమె కొత్త పార్టీ విషయంలో ఏ ప్రకటన చేయలేదు కానీ.. పార్టీ నిర్మాణం కోసం అన్నట్టుగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. మంగళవారం ఆమె ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కొత్తపార్టీపై స్పందించారు. రాజకీయ పార్టీ గురించి ఇప్పుడప్పుడే ఆలోచన చేయటం లేదని కవిత అన్నారు. బీఆర్ఎస్‌లో నుంచి తనను సస్పెండ్ చేశారని.. ఆ పార్టీతో తనకెటువంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. కుట్రతో బీఆర్ఎస్ నుంచి తనను బయటికి పంపించారంటూ వ్యాఖ్యానించారు. తన జీవితంలో చిన్న పొరపాటు కూడా చేయలేదన్నారు.
తుమ్మలను వదులుకోవడం తప్పే
రాష్ట్రంలో అధికార పక్షం, ప్రతిపక్షం బాధ్యతగా వ్యవహరించటంలేదని విమర్శించారు. ఖమ్మం జిల్లాకు చెందిన బలమైన నేత తుమ్మల నాగేశ్వరావు(Tummala Nageswara Rao)ను బీఆర్ఎస్ వదులుకోవడంతోనే మూడోసారి అధికారంలోకి రాకుండా పోయిందంటూ వ్యాఖ్యానించారు. తుమ్మల బయటకు వెళ్లడంతోనే రాష్ట్రంలో గులాబీ పార్టీ పరిస్థితి తలకిందులైందన్నారు. తుమ్మల లాంటి నేతను బీఆర్‌ఎస్ వదులుకోవడం నూటికి నూరు శాతం పెద్ద తప్పే అని అన్నారు. తెలంగాణలో ప్రతిపక్షం ఫెయిల్ అయ్యిందని.. తన బాధ్యతను నిర్వర్తించలేకపోతోందని వ్యాఖ్యలు చేశారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్రను భవిష్యత్తులో తాము పోషించబోతున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు తనకు ఎక్కడా ఎటువంటి అవకాశం ఇవ్వలేదని.. కనీసం ఒక టీచర్ పోస్ట్ కూడా ట్రాన్స్ఫర్ చేయించుకోలేకపోయానని చెప్పుకొచ్చారు.
కవిత(Kavitha) ఇంకా మాట్లాడుతూ.. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖమ్మం(Khammam) జిల్లా పూర్తిగా మారిపోయిందని గుర్తుచేశారు. వెంగళరావు హయాంలో జిల్లా విశేషంగా అభివృద్ధి చెందిందన్నారు. ఆ తరువాత తుమ్మల నాగేశ్వరావు ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని తెలిపారు. ఇంకా ఖమ్మం అభివృద్ధి చెందాల్సి ఉందని.. సీతారామ ప్రాజెక్టును కూడా వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
సామాజిక తెలంగాణ రావాలన్నదే తన ఆశయమని.. అవకాశం, అధికారం, ఆత్మగౌరవం కోసమే తన పోరాటమని కవిత స్పష్టం చేశారు. జమలాపురం టెంపుల్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జమలాపురం ఆలయంపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు. పాతర్లపాడులో సామినేని రామారావు దారుణ హత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. రామారావు హత్యపై డీజీపీని కలువనున్నట్లు కవిత తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో సింగరేణి కార్మికుల సమస్యలపై సింగరేణి భవన్‌ను ముట్టడించబోతున్నామని ప్రకటించారు.
Read Also: బనకచర్ల ప్లేస్‌లో ఏపీ మరో ప్రాజెక్ట్?
Follow Us on: Youtube

