కలం డెస్క్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తవుతుండడంతో పరిపాలనపై పూర్తిస్థాయిలో దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను(IPS officers) కీలకమైన స్థానాల్లోకి బదిలీ చేయాలనుకుంటున్నట్లు సచివాలయ వర్గాలు పేర్కొన్నాయి. స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, అడిషనల్ డీజీపీ స్థాయిలోని అధికారులను బదిలీ చేసే అవకాశాలున్నాయి. దాదాపు పాతిక మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల జాబితా ఇప్పటికే సిద్ధమైందని, ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రాగానే చీఫ్ సెక్రటరీ ప్రకటన చేసే అవకాశమున్నది. రానున్న మూడేండ్లలో ప్రభుత్వం చేపట్టనున్న కొత్త స్కీమ్‌లు, ఇప్పటికే అమలవుతున్న పథకాలను వేగవంతం చేయడం, ‘ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్టు’లు త్వరితగతిన గాడిన పడేలా చూడడం.. ఇలాంటి బాధ్యతలను పరిగణనలోకి తీసుకుని ఈ బదిలీలు ఉంటానయన్నది ఆ వర్గాల సమాచారం.
ప్రభుత్వానికి ఇంకా మూడేండ్ల గడువు ఉన్నప్పటికీ చివరి సంవత్సరం ఎన్నికల సందడికి పోతున్నందున రెండేండ్లు కీలకమన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కొత్త బాధ్యతల్లోకి వెళ్ళే అధికారులను ఈ రెండేండ్ల పాటు కదిలించకుండా వాటిల్లోనే కొనసాగాలన్న ముందుచూపుతో ముఖ్యమంత్రి ఆచితూచి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గడచిన రెండేండ్ల కాలంలో రెండుసార్లు భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల(IPS officers) బదిలీలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్ 27న జరిగిన బదిలీల్లో ఒకేసారి 19 మంది ఐఏఎస్‌లు బదిలీకాగా, ఆ తర్వాత సరిగ్గా ఐదు నెలలకు సెప్టెంబరు27న ఆరుగురు ఐఏఎస్‌లు, 23 మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. అదే స్థాయిలో ఇప్పుడు మరోసారి బదిలీల పర్వం చోటుచేసుకోనున్నది. స్థానిక ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే బదిలీల విషయంలో స్పష్టమైన ఉత్తర్వులు వెలువడే అవకాశమున్నది.
Read Also: ఓటమిపై ప్రశాంత్ కిశోర్ స్పందన ఇదే..
Follow Us on : Pinterest

