epaper
Wednesday, February 18, 2026
epaper

నోబెల్​ శాంతి బహుమతి గ్రహీతకు ఆరేళ్ల జైలు

కలం, వెబ్​డెస్క్​: ఒకవైపు అమెరికా యుద్ధం ముంచుకొస్తున్నా ఇరాన్​ మాత్రం తన నైజం వదులుకోవడం లేదు (Narges Mohammadi). ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల జరిగిన నిరసనలు, ఆందోళనలను ఇరాన్​ ప్రభుత్వం అత్యంత నిర్దాక్షిణ్యంగా అణచివేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ దమనకాండలో వేలాది మంది మరణించారు. అంతకు రెట్టింపు సంఖ్యలో గాయపడ్డారు. అంతేస్థాయిలో జైలు పాలయ్యారు. దీనిపై పలుమార్లు హెచ్చరించిన అమెరికా ఇప్పుడు ఏకంగా ఇరాన్​పై యుద్ధానికి సిద్ధమవుతోంది. ఇంత జరుగుతున్నా ఇరాన్​ మాత్రం తన ధోరణిలోనే వెళుతోంది. అందుకు నిదర్శనం.. ఆ దేశానికి చెందిన హక్కుల కార్యకర్త, నోబెల్​ శాంతి బహుమతి గ్రహీత నర్గీస్​ మొహమ్మదీకి ఆదివారం జైలు శిక్ష విధించడం.

ప్రస్తుతం వివిధ కేసుల్లో జైల్లో ఉన్నప్పటికీ నర్గీస్​ ఇరాన్​ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే చర్యలు మానుకోకపోవడంతో స్థానిక కోర్టు ఈ శిక్షలు విధించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం, మందిని కూడగట్టి ఉసిగొల్పడం వంటి నేరారోపణలపై నర్గీస్​కు ఆరేళ్ల జైలు, దేశం విడిచి వెళ్లకుండా రెండేళ్ల నిషేధం, అదనంగా మరో ఆర్నెళ్ల శిక్ష ప్రకటించింది.

కాగా, 53 ఏళ్ల నర్గీస్​ మొహమ్మదీ ఇరాన్​లో ఉరిశిక్షకు వ్యతిరేకంగా, హిజాబ్​ తప్పనిసరిపైనా కొన్నేళ్లుగా గళం విప్పారు. ప్రభుత్వంపై పోరాటానికి దిగారు. ఈ క్రమంలో ఆమెపై ఎన్నో కేసులు నమోదయ్యాయి. కోర్టులు శిక్షలు విధించాయి. గత దశాబ్ద కాలంగా ఆమె జైలులోనే ఉన్నారు. ఆమె పోరాటాలను గుర్తించిన నోబెల్​ కమిటీ శాంతి బహుమతిని ప్రకటించింది. ఆ పురస్కారాన్ని ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న ఆమె పిల్లలు తమ తల్లి తరఫున స్వీకరించారు.

ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్​ ప్రకారం ప్రపంచంలో చైనా తర్వాత అత్యంత ఎక్కువగా మరణ శిక్షలు అమలు చేస్తున్న దేశం ఇరాన్​. అందుకే వాటికి వ్యతిరేకంగా నర్గీస్ ​(Narges Mohammadi) పోరాడుతున్నారు.

Read Also: బంగ్లాదేశ్​ జైలులో హిందూ లీడర్​, మాజీ ఎంపీ అనుమానాస్పద మృతి

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>