కలం, వెబ్‌డెస్క్: ఒకవైపు అమెరికా యుద్ధం ముంచుకొస్తున్నా ఇరాన్ మాత్రం తన నైజం వదులుకోవడం లేదు (Narges Mohammadi). ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల జరిగిన నిరసనలు, ఆందోళనలను ఇరాన్ ప్రభుత్వం అత్యంత నిర్దాక్షిణ్యంగా అణచివేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ దమనకాండలో వేలాది మంది మరణించారు. అంతకు రెట్టింపు సంఖ్యలో గాయపడ్డారు. అంతేస్థాయిలో జైలు పాలయ్యారు. దీనిపై పలుమార్లు హెచ్చరించిన అమెరికా ఇప్పుడు ఏకంగా ఇరాన్‌పై యుద్ధానికి సిద్ధమవుతోంది. ఇంత జరుగుతున్నా ఇరాన్ మాత్రం తన ధోరణిలోనే వెళుతోంది. అందుకు నిదర్శనం.. ఆ దేశానికి చెందిన హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గీస్ మొహమ్మదీకి ఆదివారం జైలు శిక్ష విధించడం.
ప్రస్తుతం వివిధ కేసుల్లో జైల్లో ఉన్నప్పటికీ నర్గీస్ ఇరాన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే చర్యలు మానుకోకపోవడంతో స్థానిక కోర్టు ఈ శిక్షలు విధించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం, మందిని కూడగట్టి ఉసిగొల్పడం వంటి నేరారోపణలపై నర్గీస్‌కు ఆరేళ్ల జైలు, దేశం విడిచి వెళ్లకుండా రెండేళ్ల నిషేధం, అదనంగా మరో ఆర్నెళ్ల శిక్ష ప్రకటించింది.
కాగా, 53 ఏళ్ల నర్గీస్ మొహమ్మదీ ఇరాన్లో ఉరిశిక్షకు వ్యతిరేకంగా, హిజాబ్ తప్పనిసరిపైనా కొన్నేళ్లుగా గళం విప్పారు. ప్రభుత్వంపై పోరాటానికి దిగారు. ఈ క్రమంలో ఆమెపై ఎన్నో కేసులు నమోదయ్యాయి. కోర్టులు శిక్షలు విధించాయి. గత దశాబ్ద కాలంగా ఆమె జైలులోనే ఉన్నారు. ఆమె పోరాటాలను గుర్తించిన నోబెల్ కమిటీ శాంతి బహుమతిని ప్రకటించింది. ఆ పురస్కారాన్ని ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న ఆమె పిల్లలు తమ తల్లి తరఫున స్వీకరించారు.
ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం ప్రపంచంలో చైనా తర్వాత అత్యంత ఎక్కువగా మరణ శిక్షలు అమలు చేస్తున్న దేశం ఇరాన్. అందుకే వాటికి వ్యతిరేకంగా నర్గీస్ (Narges Mohammadi) పోరాడుతున్నారు.
Read Also: బంగ్లాదేశ్ జైలులో హిందూ లీడర్, మాజీ ఎంపీ అనుమానాస్పద మృతి
Follow Us On: Pinterest


