Maredumilli Encounter | అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి టైగర్‌జోన్‌లో మంగళవారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసు దళాలు–మావోయిస్టుల మధ్య తీవ్రంగా కొనసాగిన కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా ప్రకటించారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. ఛత్తీస్‌గఢ్, ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు పెరిగినట్లు ఇంటెలిజెన్స్ విభాగాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో స్పెషల్ పార్టీలు, గ్రేహౌండ్స్ బలగాలు భారీ స్థాయిలో కూంబింగ్ చేపట్టాయి. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య గస్తీ నిర్వహిస్తున్న పోలీసు బలగాలకు మావోయిస్టు దళాలు కనిపించినట్టు సమాచారం. వెంటనే రెండు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఆరుగురు మావోయిస్టులు అక్కడికక్కడే కూలిపోయారని అధికారులు తెలిపారు.
మృతుల్లో అగ్రనేత హిడ్మా?
ఈ ఎన్‌కౌంటర్(Maredumilli Encounter)లో అగ్రనేత మడావి హిడ్మా మృతి చెందినట్టు ప్రచారం జరుగుతోంది. ఆయనతోపాటు భార్య హేమ, మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందారని సమాచారం. దీనిపై డీజీపీ అధికారిక ప్రకటన ఇవ్వలేదు. హిడ్మాపై కోటి రూపాయల రివార్డు ఉండగా, అతని భార్య హేమపై రూ.50 లక్షల బహుమతి ఉంది. హిడ్మా మృతి నిజమైతే మావోయిస్టు మిలిటరీ వింగ్‌కు భారీ దెబ్బ అవుతుందని భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలోనూ ఎన్ కౌంటర్ జరిగింది. ఎర్రబోరు ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందినట్టు సమాచారం.
Read Also: బీహార్‌లో స్పీకర్ పదవి కోసం పోటాపోటీ
Follow Us on : Pinterest

