కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి (Kukatpally) ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. తక్కువ ధరకే ఫ్లాట్లు కట్టించి ఇస్తామని నమ్మించి వందలాది మంది నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన వైట్ వాటర్ కన్‌స్ట్రక్షన్ (White Water Construction) సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంస్థ సుమారు 500 మంది బాధితుల నుండి దాదాపు 27 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.
గడిచిన పదేళ్లుగా ప్రాజెక్టుల పేరు చెప్పి ఈ వసూళ్లకు పాల్పడినట్లు బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బలు చెల్లించి ఏళ్లు గడుస్తున్నా నిర్మాణాలు చేపట్టకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో వైట్ వాటర్ కన్‌స్ట్రక్షన్ (White Water Construction) యజమాని అజయ్‌తో పాటు ఈ అక్రమాల్లో భాగస్వాములైన మరికొందరిపై కూడా కేసులు నమోదయ్యాయి.
ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి 100 మందికి పైగా బాధితులు సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగంలో (EOW) ఫిర్యాదు చేశారు. తక్కువ పెట్టుబడితో సొంత ఇంటి కల నెరవేరుతుందని ఆశపడ్డ ప్రజలు ఇప్పుడు తమ డబ్బు తిరిగి రాక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ప్రస్తుతం ఈ కుంభకోణంపై విచారణ జరుపుతున్నారు.
Read Also: మంత్రి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు
Follow Us On: X(Twitter)


